టికెట్ల రేట్ల పంచాయితీ మళ్లీ మొదటికి

తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఒక ఎడతెగని పంచాయితీగా మారుతోంది. నిర్మాతలు రేట్ల పెంపు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడం.. చివరి నిమిషంలో ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం.. తర్వాత ఎవరో ఒకరు రేట్ల పెంపుకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కడం.. కోర్టు ప్రభుత్వాన్ని మందలించడం, రేట్ల పెంపుపై స్టే విధించడం.. ఇదీ వరస.

సంక్రాంతి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రేట్లు పెంచడం మీద హైకోర్టు సీరియస్ అయి.. ఇకపై ఏదైనా కొత్త సినిమాకు ధరలు పెంచాలంటే 90 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ ఆదేశాల మీద స్టే కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయినా సరే.. ఇటీవల ‘పెద్ది’ సినిమాకు రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ప్రిమియర్స్‌కు రూ.600 రేటు పెట్టగా.. తొలి రోజు నుంచి పదో రోజు వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 రేట్లు పెంచారు. ఆ ప్రకారమే సినిమా ఆడుతుండగా.. ఇప్పుడు రేట్ల పెంపు మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలవడం చర్చనీయాంశంగా మారింది.
జీవో 151ను పక్కన పెట్టి ఈ నెల రెండో తారీఖున ‘పెద్ది’ టికెట్ల ధరల పెంపు కోసం ప్రత్యేక జీవో జారీ చేశారని.. హైకోర్టు జనవరిలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఈ జీవోను ఇచ్చి తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు… ధరల పెంపు జీవోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ప్రాథమికంగా హైకోర్టు స్పందన చూస్తే.. టికెట్ల రేట్ల పెంపు విషయంలో మరోసారి ప్రభుత్వానికి అక్షింతలు పడేలా కనిపిస్తోంది. కానీ రేట్ల పెంపుపై హైకోర్టు ప్రతిసారీ సీరియస్ అవుతున్నప్పటికీ, స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం దాన్ని మీరి రేట్ల పెంపుకి ఎందుకు అనుమతులు ఇస్తోంది.. తద్వారా ప్రేక్షకుల్లోనూ ఎందుకు వ్యతిరేకత పెంచుకుంటోంది అన్నది అర్థం కాని విషయం.

తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.295గా ఉంది. సౌత్ ఇండియాలో మరెక్కడా మల్టీప్లెక్స్‌లో ఇంత రేటు లేదు. దాని మీద కొత్త సినిమాలకు మళ్లీ రూ.125 వడ్డించడం పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా నిర్మాతలు రేట్ల పెంపు అడగడం.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అన్నది ఎంత వరకు సమంజసమన్నది ప్రశ్న.