సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సోలో హీరోగా మూవీ వచ్చి పదిహేడు నెలలు దాటేసింది. నాగార్జున సంగతి సరేసరి. సపోర్టింగ్ రోల్స్ చేసిన కూలి, కుబేర మినహాయిస్తే ఆయన చివరి ప్లేసులో ఉన్నారు. రకరకాల కారణాలు వీళ్లకు ఉండొచ్చు కానీ మంచి ప్లానింగ్ తో వెళ్తోంది బాలయ్యనే. ఎందుకో చూద్దాం.
కొంచెం లేట్ గా మొదలైనప్పటికీ ఎన్బికె 111 షూటింగ్ వేగంగా జరుగుతోంది. నిన్న వదిలిన టీజర్ అభిమానులకు బాగానే జోష్ ఇచ్చింది. కేవలం ఒక ఫైట్ విజువల్స్ తీసుకుని కట్ చేయడం వల్ల కొంచెం ఇంపాక్ట్ తగ్గి ఉండొచ్చు కానీ అసలు ట్రైలర్ వచ్చాక లెక్కలు మారిపోతాయని టీమ్ నమ్మకంగా ఉంది. దీని తర్వాత కొరటాల శివతో చేయబోయే స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. డేట్స్ ఇవ్వడం ఆలస్యం సెట్స్ పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసేశారు. ప్రస్తుతం క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
బయట ప్రచారం జరిగినట్టు దర్శకుడు వివేక్ ఆత్రేయతో ప్రాజెక్టు ఆగిపోలేదు. కొంచెం హోల్డ్ లో పెట్టారు అంతే. నిన్న మైత్రి రవిశంకర్, వివేక్ ఆత్రేయ కలిసి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం చూశాక అందరికీ డౌట్లు తీరిపోయాయి. కాకపోతే వచ్చే ఏడాది మొదలవుతుంది. ఈ మూడు పక్కాగా ఫిక్స్ అయిపోయాయి. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల చెప్పిన స్టోరీ మీద కూడా వర్క్ జరుగుతోంది. నెరేషన్ ఓకే అనుకున్నాక అనౌన్స్ మెంట్ వస్తుంది.
ఇవి కాకుండా బాలయ్య డ్రీం ప్రాజెక్టు ఆదిత్య 999 మ్యాక్స్ ఎప్పుడు మొదలవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ దీనితో జరుగుతుందనే తరహాలో బాలకృష్ణ ఒక సంకేతం ఇచ్చారు. కానీ ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. ప్రశాంత్ వర్మతో అనౌన్స్ చేసిన మోక్షజ్ఞ సోలో మూవీ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇది పక్కనపెడితే మొత్తానికి బాలయ్య తన డైరీలో ఖాళీగా ఉంచుకునే ఉద్దేశంలో లేరు. అందుకే ఇంత పక్కా ప్రణాళిక కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
