పునీత్ తో పాటే వెళ్లిపోయిన… నీల్ ఫ్యామిలీ కథ!

ప్రశాంత్ నీల్ అనగానే భారీ బ్లాస్ట్ లు, తుపాకుల మోతలు, డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే రక్తపాతం గుర్తొస్తాయి. కెజిఎఫ్, సలార్, ఇప్పుడు తారక్ తో చేస్తున్న డ్రాగన్.. ఇవన్నీ ఒకే మీటర్ లో సాగే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్. ఇంతటి వైలెన్స్ ను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ డైరెక్టర్ లో ఒక సున్నితమైన కథకుడు ఉన్నాడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పై ఒక ఎమోషనల్ రియాక్షన్ తో నీల్ లోని ఆ సాఫ్ట్ యాంగిల్ బయటపడింది.

కెజిఎఫ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే హోంబలే ఫిల్మ్స్ ఆఫీస్ కు ప్రశాంత్ నీల్ మొదటిసారి వెళ్ళినప్పుడు యాక్షన్ కథను తీసుకెళ్లలేదు. ఒక అచ్చమైన ఫ్యామిలీ స్టోరీతో వాళ్ళను కలిశాడు. కానీ వాళ్లకు అలాంటి కాన్సెప్ట్ కన్నా కమర్షియల్ గా పెద్ద స్కేల్ లో ఉండే సబ్జెక్ట్ కావాలని అడగడంతో అప్పటికప్పుడు కెజిఎఫ్ సీన్ నెరేట్ చేయడం, ఆ తర్వాత అది ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని మార్చేయడం జరిగిపోయాయి.

ఇప్పుడు ఆ పాత ఫ్యామిలీ కథ ఏమైంది అనే దానిపై నీల్ ఇచ్చిన సమాధానం ఇండస్ట్రీ జనాలను ఆలోచింపజేస్తోంది. ఆ ఫ్యామిలీ కథను కేవలం పునీత్ రాజ్ కుమార్ కోసమే రాసుకున్నానని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు. కన్నడ నాట పునీత్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అప్పు చిరునవ్వుకు సెట్ అయ్యేలా ఒక అందమైన ఫ్యామిలీ డ్రామాను నీల్ ఎప్పుడో సిద్ధం చేసుకున్నాడట. కానీ పునీత్ అకాల మరణం చెందడంతో, ఆ కథను శాశ్వతంగా పక్కన పెట్టేశాడు.

ఆ కథ ఆయనతో పాటే వెళ్ళిపోయింది అంటూ నీల్ చెప్పిన మాటలు వింటే, ఒక హీరో కోసం డైరెక్టర్ రాసుకున్న కథకు ఎంతటి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందో అర్థమవుతుంది. ఇండస్ట్రీలో ఒక కథను ఇద్దరు ముగ్గురు హీరోలకు వినిపించడం, ఒకరు కాదంటే మరొకరితో తీయడం చాలా కామన్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇలా హీరోలు మారినవే. కానీ కేవలం ఒకే ఒక నటుడి కోసం కథను రాసుకోవడం, ఆయన లేడనే కారణంతో ఆ కథను ఇంకెవరికీ ఇవ్వకుండా శాశ్వతంగా ఆపేయడం చాలా అరుదుగా చూస్తుంటాం.

పునీత్ మీద నీల్ కు ఉన్న గౌరవానికి, ఆ కథలోని సోల్ కు ఈ నిర్ణయం అద్దం పడుతోంది. అప్పు లాంటి క్యారెక్టరైజేషన్ వేరొక స్టార్ హీరోకు సెట్ కాదని నీల్ బలంగా నమ్మాడు. ప్రస్తుతం నీల్ తన ఫోకస్ అంతా ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా మీదే పెట్టాడు. పూర్తిగా మాస్ దర్శకుడిగా తనకంటూ ఒక సెపరేట్ యూనివర్స్ ను క్రియేట్ చేసుకుంటూ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. ఈ డార్క్ సినిమాలే ఆయనకు మార్కెట్ లో తిరుగులేని డిమాండ్ ను తీసుకొచ్చాయి. ఇలాంటి సమయంలో తన కెరీర్ లో ఎప్పటికీ తెరకెక్కని ఆ ఫ్యామిలీ డ్రామా ఒక తీరని కలగానే మిగిలిపోయింది.