మంచు మనోజ్ పంచు ఎవరి మీదో

సోలో హీరోగా ఆ మధ్య చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ అటు విలన్ గా చేస్తూనే కథానాయకుడిగా కూడా వరసగా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. డేవిడ్ రెడ్డి ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో తీస్తున్నారు. ఇవాళ కొత్త మూవీ వడ్డీకాసులవాడ అనౌన్స్ చేశారు. అనిల్ సుంకరతో పాటు మనోజ్ నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న ఈ మూవీ కాన్సెప్ట్ ని టీజర్ రూపంలో విడుదల చేశారు మొత్తం ఏఐ టెక్నాలజీ వాడి కథేంటో క్లూ ఇచ్చారు.

నెల తిరిగే సరికి అప్పుల్లో కూరుకుపోయే ఒక తిరుపతి కుర్రాడికి ఎలాగైనా సరే వాటి నుంచి బయటపడి శ్రీమంతుడిగా మారి దర్జాగా బ్రతకాలనేది కోరిక. దాని కోసం ఏడుకొండల వాడిని నిత్యం వేడుకుంటూ ఉంటాడు. ఒకవేళ తన కలను నిజం చేస్తే ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి కులం మతం చూడకుండా ఇరవై అయిదు శాతం డిస్కౌంట్ ఇస్తానని నొక్కి చెబుతాడు. అది కూడా తండ్రి మోహన్ బాబుని ఇమిటేట్ చేస్తున్న వాయిస్ తో కావడం గమనించాల్సిన విషయం.

అంటే మంచు మనోజ్ ఇన్ డైరెక్ట్ గా పంచులు వేస్తున్నట్టే ఉంది. నిన్న ప్రెస్ మీట్ లో కూడా గతంలో జరిగిన కాంట్రవర్సీ గురించి మాట్లాడుతూ ఎవరిని అడగాలో తెలుసుగా, మైక్ బదులు హెల్మెట్ పెట్టుకుని వెళ్లి అడగండి అంటూ కామెడీ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడీ వడ్డీ కాసులవాడలో కాలేజీ ప్రస్తావన తేవడం చూస్తే అన్న మీదో నాన్న మీదో చిన్న కౌంటర్ వేసినట్టుగా ఉంది. దీని సంగతలా ఉంచితే మనోజ్ బిజీ అవుతున్నాడు.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న భారీ చిత్రంలో మనోజ్ లాక్ అయ్యాడు. పాజిటివ్ పాత్రా లేక నెగటివా అనేది తెలియాల్సి ఉంది. గతంలో మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలయ్య కాస్త ఎక్కువ నిడివి ఉన్న ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దాని ఫలితం ఏమైనా ఇన్నేళ్ల తర్వాత మనోజ్ మళ్ళీ బాలకృష్ణతో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నాడు. డేవిడ్ రెడ్డి, ఎన్బికె 111 ఈ రెండు ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి.