సేఫ్ గేమ్ ఆడాలి జన నాయకా

ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు కానీ తమిళనాడు సీఎం విజయ్ కొత్త సినిమా జన నాయకుడు రిలీజ్ అతి త్వరలో జరగనుంది. మే 27 అని ప్రచారం జరిగింది కానీ ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ చేతికి అందలేదని చెన్నై రిపోర్ట్. ఇదిలా ఉండగా మొన్నటిదాకా బజ్ సమస్యతో పోరాడిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓవర్ డిమాండ్ ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా తమిళ వెర్షన్ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడుతున్నారు. తగ్గిపోయిన ఓటిటి రేటు ఇప్పుడు డబుల్ అయ్యిందట.

ఏపీ తెలంగాణ తెలుగు హక్కులకు నిర్మాత ముప్పై ఐదు కోట్ల దాకా ఆశిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. అంటే అరవై కోట్లకు పైగా గ్రాస్ రావాలి. ఇది చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే జన నాయకుడుకి మన దగ్గర చాలా రిస్కులు పొంచి ఉన్నాయి. మొదటిది ఇది భగవంత్ కేసరి రీమేక్. ట్రయిలర్ వచ్చాక అందరికీ తెలిసిపోయింది. సో సాధారణ ప్రేక్షకులు అంత సులభంగా థియేటర్లకు కదిలరు. ఎంత ఫ్యాన్స్ అయినా లియో, తుపాకి లాగా మళ్ళీ మళ్ళీ చూసే ఆసక్తి కలగకపోవచ్చు.

పైగా పెద్దికి ముందు వెనుక ఎప్పుడు జన నాయకుడు వచ్చినా రామ్ చరణ్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉంటుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని పదిహేను కోట్ల దాకా మన అగ్ర నిర్మాతల్లో ఒకరు ఆఫర్ చేసినట్టు సమాచారం. భారీ వ్యత్యాసం ఉంది కాబట్టి డీల్ సెటిల్ కావడానికి కొంత టైం పట్టొచ్చు. విజయ్ ముఖ్యమంత్రి కావడం మన ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విషయం కాదు. కేవలం దాని ఆధారంగా ఎక్కువ రేట్ తెలుగు మార్కెట్ నుంచి డిమాండ్ చేయడమూ సబబు కాదు

ఇదంతా తేలడానికి సమయం పట్టేలా అయితే లేదు. నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కు ఇటీవలే కన్నడ మూవీ కెడి ది డెవిల్ రూపంలో షాక్ తగిలింది. అది మరీ తీవ్రం కాకపోయినా నష్టాలైతే మిగిలాయి. ఇక ఇప్పుడు జన నాయగన్ కనక బ్లాక్ బస్టర్ అయితే మొత్తం సెట్ అవుతుంది. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న టాక్సిక్, ఎల్లుండి ప్రారంభం కాబోతున్న మెగా 158కి కొత్త ఉత్సాహం వస్తాయి. ఒకవేళ ఈ నెల సాధ్యం కాకపోతే జూన్ రెండు లేదా మూడో వారంలో జన నాయకుడు రిలీజ్ కావొచ్చని టాక్.