మోదీ చెప్పారని సూర్య ట్రిప్ కాన్సిల్ చేసిన విజయ్

గ‌త కొన్నేళ్లలో సినిమాల ప‌రంగా భాష‌ల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోయాయి. ప్రాంతీయ భాషా చిత్రాలు వివిధ భాష‌ల్లో రిలీజ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వివిధ ఇండ‌స్ట్రీల‌కు చెందిన ఫిలిం సెల‌బ్రెటీల మ‌ధ్య కూడా మంచి సంబంధాలు ఏర్ప‌డుతున్నాయి. ప్ర‌మోష‌న్ ప‌రంగా ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటున్నారు.

సోష‌ల్ మీడియాలో కూడా మంచి సంబంధాల‌ను కొన‌సాగిస్తూ ఒక‌రి చిత్రాన్ని ఒక‌రు జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఫిలిం సెల‌బ్రెటీల మ‌ధ్య‌ స‌ర‌దా సంభాష‌ణ‌లు కూడా న‌డుస్తుంటాయి సోష‌ల్ మీడియాలో. తాజాగా సూర్య న‌టించిన క‌రుప్పు సినిమా విడుద‌ల విష‌యంలో ఎదురైన అడ్డంకుల‌ను అధిగ‌మించి, ఒక రోజు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

టాక్ అంత గొప్ప‌గా లేక‌పోయినా ఈ చిత్రానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రిస్థితులు క‌లిసొచ్చి మంచి ఫ‌లితమే రాబ‌డుతోంది. ముఖ్యంగా క‌రుప్పు త‌మిళంలో భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది. తెలుగులో క‌లెక్ష‌న్లు ప‌ర్వాలేదు.

ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌రుప్పు గురించి ట్వీట్ వేశాడు. ఈ సినిమా మంచి వ‌సూళ్లు సాధిస్తుండ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సూర్య‌ అండ్ టీంకు విజ‌య్ శుభాకాంక్ష‌లు చెప్పాడు. ఈ ట్వీట్‌కు సూర్య‌, త్రిష‌తో పాటు మ‌రి కొంద‌రు క‌రుప్పు టీం స‌భ్యులు స్పందించారు. విజ‌య్‌కి థ్యాంక్స్ చెప్పారు.

ఐతే సూర్య రిప్లై కొంచెం స్పెష‌ల్‌గానే ఇచ్చాడు. ఇదంతా మా ప్రియ‌మైన అభిమానుల కోసం అంటూ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తూ పోస్టు పెట్టాడు సూర్య‌. అంతటితో ఆగ‌కుండా మంచి హాలిడే స్పాట్ చెప్పు అంటూ విజ‌య్‌ని అడిగాడు సూర్య‌. విజ‌య్, ర‌ష్మిక త‌ర‌చుగా హాలిడేల‌కు వెళ్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందు నుంచే ఇది న‌డుస్తోంది.

పెళ్లి త‌ర్వాత కూడా రెండు టూర్ల‌కు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో సూర్య సర‌దాగానే విజ‌య్‌ని హాలిడే స్పాట్ గురించి అడిగాడు. దీనికి విజ‌య్ బ‌దులిస్తూ.. మ‌న ప్ర‌ధాని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో విదేశీ ప‌ర్య‌ట‌న‌లు వ‌ద్ద‌ని అంటున్నాడ‌ని.. కాబ‌ట్టి దేశీయంగా మంచి హాలిడే స్పాట్ల వివ‌రాల‌ను వాట్సాప్ ద్వారా పంపించానంటూ విజ‌య్ బ‌దులిచ్చాడు. ఈ సంభాష‌ణ ఇరువురి అభిమానుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది.