తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి థియేటర్ రెవెన్యూలో వాటా ఇస్తేనే ఇకపై సింగిల్ స్క్రీన్లలో సినిమాలను నడిపిస్తామంటూ దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి, ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్ సహా పలువురు ఎగ్జిబిటర్లు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అల్టిమేటం విధించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
దీనిపై ఈ రోజు నిర్మాతల తరఫున మైత్రీ మూవీస్ రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి తదితరులు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సమవేశంలో రవిశంకర్.. శిరీష్‌ను టార్గెట్ చేస్తూ సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు.
తమ సినిమాల రిలీజ్ ఉన్నపుడు శిరీష్ ఏమీ మాట్లాడరని.. కానీ వేరే వాళ్ల పెద్ద సినిమాల విడుదలకు ముందే ఆయనకు ఎగ్జిబిటర్ల సమస్యలు గుర్తుకు వస్తాయని రవిశంకర్ కౌంటర్ వేశారు. గత ఏడాది తాము రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు టైంలో ఈ సమస్య మొదలైందని.. ఆ తర్వాత శిరీష్ వార్ 2, కూలీ, ఓజీ, అఖండ, నారీ నారీ నడుమ మురారి, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలను రిలీజ్ చేశారని.. ఈ సినిమాలన్నీ విడుదల చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు ఆయనకు కనిపించలేదా అని రవిశంకర్ ప్రశ్నించారు.
మీరు ప్రొడ్యూస్ చేసిన పెద్ద సినిమా రిలీజైనపుడు ఎగ్జిబిటర్లకు ఇదిగో పర్సంటేజ్ అని ఎగ్జిబిటర్‌కు ఇచ్చి పెద్ద మనసును చాటుకుంటే ఫిలిం నగర్లో విగ్రహం పెడతామని ఆయన సెటైర్ వేశారు. నాలుగైదు నెలలుగా సరైన సినిమా లేదని.. ఇప్పుడు మీ సినిమా లేని టైం చూసుకుని, తమ ప్రొడక్షన్లో వస్తున్న పెద్ది రిలీజవ్వబోతుండగా పర్సంటేజీ అంటూ బ్లాక్ మెయిట్ చేస్తున్నారా అని ఆయన శిరీష్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
రాత్రికి రాత్రే మార్పు రావాలి అంటే కుదరదని..పర్సంటేజీ కావాలని అడుగుతున్న సింగిల్ స్క్రీన్లలో ముక్కు మూసుకోకుండా టాయిలెట్‌కి వెళ్లగలిగే థియేటర్లు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్లలో సౌకర్యాలు కల్పించి, టెక్నికల్‌గా అప్‌గ్రేడ్ చేస్తే ఆటోమేటిగ్గా జనం థియేటర్లకు వస్తారని.. అందుకు తమ ఆధ్వర్యంలో నడుస్తున్న విమల్ థియేటరే ఉదాహరణ అని రవిశంకర్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates