దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతుండగా.. గత ఏడాదే అతను నటుడిగా తన తొలి చిత్రానికి ఓకే చెప్పాడు. అది కూడా ఎవరో చేయాల్సిన ‘యల్లమ్మ’ సినిమాను అతను టేకప్ చేశాడు. ‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ వేణు యల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ సినిమాలో కథానాయిక విషయమై కొన్నేళ్ల ముందు నుంచి రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి.
‘యల్లమ్మ’లో ముందు నానిని హీరోగా అనుకున్నారు. అప్పుడు కీర్తి సురేష్ పేరు వినిపించింది. తర్వాత హీరో స్థానంలోకి నితిన్ వచ్చాక కూడా కీర్తి పేరే ప్రచారంలో ఉంది. ఐతే దేవిశ్రీ ప్రసాద్ లీడ్ రోల్‌కు కన్ఫమ్ అయ్యాక కీర్తి పేరు పక్కకు వెళ్లిపోయింది. సాయిపల్లవి ఇందులో కథానాయికగా నటించొచ్చని రూమర్లు వినిపించాయి. కానీ ఆమె ఈ సినిమాను ఓకే చేసేంత ఖాళీగా లేదు.
తాజా సమాచారం ప్రకారం ‘యల్లమ్మ’లో మృణాల్ ఠాకూర్ నటించబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మృణాల్‌కు బాలీవుడ్లో గ్లామర్ ఇమేజ్ ఉంది కానీ.. తెలుగులో మాత్రం ఆమె పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తోంది. ‘సీతారామం’లో సీత పాత్రతో వచ్చిన గుర్తింపుకు తగ్గట్లే ఆమె నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటోంది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, డెకాయిట్.. ఈ చిత్రాల వరస చూస్తే అర్థమవుతుంది.
‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ అయినా సరే.. అందులో కూడా ఆమెది కథలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే.
‘యల్లమ్మ’లో దేవి సరసన మృణాల్ నటించడం ఆమె స్థాయికి తగునా అన్న సందేహాలు కలగొచ్చు. కానీ ఈ సినిమాలో కథానాయిక పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని.. పెర్ఫామెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇదని అంటున్నారు.
ఆ కోణంలో ఆలోచించే మృణాల్ ఈ సినిమాను ఓకే చేసి ఉంటుందని భావిస్తున్నారు. ‘బలగం’ చిత్రాన్ని నిర్మించిన అగ్ర నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ ఈ సినిమా చేస్తుండడం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates