ఫ్యాన్స్ వల్ల గెలిచాడు.. ఫ్యాన్స్ షోలు ఇస్తాడా?

తెలుగు రాష్ట్రాల్లో మాదిరే ఫ్యాన్ కల్చర్ బలంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. అక్కడ పెద్ద పెద్ద హీరోలున్నారు. వారికి భారీగా అభిమాన గణం ఉంది. హీరోలను దేవుళ్లలా ఆరాధించే.. సినిమానే జీవితం అని భావించే.. సినిమాలను బాగా సెలబ్రేట్ చేసే అభిమానులు అక్కడ కూడా కోకొల్లలుగా ఉన్నారు. ఐతే వాళ్లందరికీ తీవ్ర నిరాశను కలిగిస్తూ కొన్నేళ్ల ముందు బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసి పడేసింది డీఎంకే ప్రభుత్వం.

తెలుగు రాష్ట్రాల్లో ముందు రోజు రాత్రి నుంచే స్పెషల్ షోలు పడుతుంటాయి. లేదంటే తెల్లవారుజామున షోలు ఉంటాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో బెెనిఫిట్ షోలకు ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోతోంది.
ఐతే పొరుగు రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే.. తమ దగ్గర మాత్రం ఉదయం 9కి కానీ షోలు పడవని తమిళ సినీ ప్రియులు చాలా ఫీలవుతూ వస్తున్నారు.

ముఖ్యం పెద్ద హీరోల సినిమాలను మిగతా ప్రపంచం అంతా చూసేశాక తాము చూడాల్సి వస్తోందని వాళ్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ముందు షోలు పడుతుంటే.. తమిళనాట మాత్రం ఆలస్యంగా షోలు ఆరంభమవుతున్న పరిస్థితి. ఈ విషయంలో ప్రభుత్వానికి సినీ రంగం నుంచి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది.
ఐతే ఇప్పుడు డీఎంకే ప్రభుత్వం పడిపోయింది.

విజయ్ సీఎం అవుతున్నాడు. అతడికి సినీ రంగం ఇబ్బందులు, అభిమానుల ఆకాంక్షలు తెలియనివి కావు. ముఖ్యంగా తన అభిమానుల వల్లే సీఎం అయ్యాడు కాబట్టి.. వారి మనోగతాన్ని బాగానే అర్థం చేసుకుంటాడని భావిస్తున్నారు.

తన సినిమాలకు బెనిఫిట్ షోలు లేకపోవడంతో ఫ్యాన్స్ ఎంత నిరాశ చెందారో అతడికి బాగా తెలుసు కాబట్టి.. తమిళనాట అర్లీ మార్నింగ్ షోలకు విజయ్ ఆటోమేటిగ్గా పర్మిషన్లు ఇచ్చేస్తాడని భావిస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చేశాడు. స్పెషల్ షోలు, టికెట్ల రేట్ల విషయంలో సినీ రంగం ఏం కోరుకుంటే అది చేసి పెట్టాడు. అదే బాటలో విజయ్ కూడా సినీ రంగానికి ముందుగా బెనిఫిట్ షోల రూపంలో వరం ఇచ్చే అవకాశముంది.