తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త కొత్త కథలతో సినిమాలు తీసేవాళ్లు. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపించేవాళ్లు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మణిరత్నం, శంకర్, మురుగదాస్ లాంటి ముందు తరం లెజెండరీ డైరెక్టర్లు ఒక్కొక్కరుగా ఫామ్ కోల్పోయారు. మిగతా దర్శకుల్లో కూడా అంతగా విషయం కనిపించడం లేదు. లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ లాంటి కొంతమంది దర్శకులు మాత్రమే స్టార్ల కంటికి కనిపిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో తమిళ హీరోలు ఎన్నడూ లేని విధంగా పర భాషా దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో ధనుష్ ఒకడు. అతను తెలుగు దర్శకులతో రెండు సినిమాలు చేశాడు. ఒకటి వెంకీ అట్లూరి తీసిన ‘సార్’, ఇంకోటి శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేర’. ఈ రెండు చిత్రాలూ మంచి ఫలితాన్నందుకున్నాయి. ‘సార్’ రెండు భాషల్లోనూ విజయవంతం కాగా.. ‘కుబేర’ తెలుగులో బాగా ఆడి, తమిళంలో ఒక మోస్తరు ఫలితాన్నందుకుంది.

మరోవైపు బాలీవుడ్లో ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ‘తేరే ఇష్క్ మే’ కూడా హిట్టయింది. ఇది కాక స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఇడ్లీ కడై’ ఓ మాదిరిగా ఆడింది. కానీ వేరే తమిళ దర్శకులతో పని చేస్తే ధనుష్‌కు విజయాలు దక్కట్లేదు. అన్న సెల్వ రాఘవన్ రూపొందించిన ‘నానే వరువేన్’, అరుణ్ మాథేశ్వరన్ తీసిన ‘కెప్టెన్ మిల్లర్’ ఫ్లాప్ కాగా.. లేటెస్ట్‌గా విఘ్నేష్ రాజా తీసిన ‘కర’ కూడా తుస్సుమనిపించింది. ఈ మూవీకి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు.

రిలీజ్ ముంగిట బజ్ క్రియేట్ చేయలేకపోయిన ఈ చిత్రానికి టాక్ కూడా బాగా లేకపోవడంతో వీకెండ్లోనే సరైన వసూళ్లు లేవు. అంతిమంగా గత కొన్నేళ్లలో ధనుష్ కెరీర్లోనే అత్యల్ప వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కర’ నిలవబోతోందన్నది స్పష్టం. ఓవైపు పరభాషా దర్శకులు ధనుష్ కెరీర్‌ను లేపే ప్రయత్నం చేస్తుంటారు.. తమిళ డైరెక్టర్లు మాత్రం అతణ్ని ముంచేస్తుండడం పట్ల అభిమానులు ఆవేదన చెందుతున్నారు.