కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో తెలిసిందే. నెల‌ల త‌ర‌బ‌డి ప్ర‌య‌త్నించాక సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సుంద‌ర్.సిని ఈ చిత్రం కోసం ఓకే చేశారు. కానీ ఈ కాంబినేష‌న్లో సినిమా అనౌన్స్ అయిన రెండు వారాల్లోపే సుంద‌ర్.. ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

సింపుల్‌గా ఈ సినిమా నుంచి తాను వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సుంద‌ర్.. ఈ విష‌యంలో వివాదం త‌లెత్త‌కుండా చూశాడు. త‌ర్వాత ఆయ‌న స్థానంలోకి శిబి చ‌క్ర‌వ‌ర్తి వ‌చ్చాడు. మ‌ధ్య‌లో అత‌ను కూడా త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి కానీ.. అది నిజం కాద‌ని తేలింది.

ఇటీవ‌లే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన సుంద‌ర్.. తాజాగా ర‌జినీ సినిమాను వ‌దులుకోవ‌డంపై వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ ద‌శ‌లో ర‌జినీ సినిమాను హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకే ఆ ప్రాజెక్టును వ‌దులుకున్న‌ట్లు సుంద‌ర్ స్ప‌ష్టం చేశాడు.

నిజాయితీగా చెప్పాలంటే రజినీ సినిమా చేయ‌డం నా వ‌ర‌కు తీవ్ర ఒత్తిడితో కూడుకున్న‌ది. గ‌త 16 ఏళ్లుగా నేను నాకు న‌చ్చిన‌ట్లుగా సినిమాలు చేసుకుంటున్నాను. ప్రేక్ష‌కులకు నేనేం తీస్తే న‌చ్చుతుందో అర్థం చేసుకుని సినిమాలు తీస్తున్నా. ఈ ద‌శ‌లో ర‌జినీ సినిమాను డీల్ చేసే సామ‌ర్థ్యం నాకు లేద‌నిపించింది. నాకు క‌థ‌ను స‌రిగ్గా చెప్ప‌డం రాదు. కొన్నిసార్లు కొన్ని విష‌యాల్లో ఎక్కువ పోరాడ‌కుండానే రాజీ ప‌డిపోతుంటా.

ఇలాంటి పెద్ద సినిమా చేస్తే అందులో నా ఒక్క‌డి నిర్ణ‌య‌మే ఉండ‌దు. సినిమా చేద్దాం అనుకున్న‌ప్ప‌టి నుంచి నేను ఒత్తిడిలో ప‌డ్డాను. నేను ఈ సినిమా, ఇందులో భాగ‌మైన వ్య‌క్తుల‌తో నిజాయితీగా ఉండ‌లేను అనిపించింది. అందుకే ప్రాజెక్టు ఆరంభ ద‌శ‌లోనే త‌ప్పుకున్నాను అని సుంద‌ర్ వివ‌రించాడు.

ఒక‌ప్పుడు ర‌జినీతో అరుణాచ‌లం లాంటి పెద్ద హిట్ ఇచ్చిన చ‌రిత్ర సుంద‌ర్‌కు ఉంది. ఐతే త‌ర్వాత క‌మ‌ల్‌తో చేసిన స‌త్య‌మే శివం క‌మ‌ర్షియ‌ల్‌గా ఆడ‌లేదు. ఆ సినిమా వ‌ల్ల తాను చాలా ఇబ్బంది ప‌డ్డానంటూ త‌ర్వాత సుంద‌ర్ బాధ ప‌డ్డాడు.

అప్ప‌ట్నుంచి అత‌ను పెద్ద స్టార్ల సినిమాల‌కు దూరం అయ్యాడు. మిడ్ రేంజ్, చిన్న హీరోల‌తోనే త‌న స్టైల్ మాస్ మ‌సాలా, హార్ర‌ర్ కామెడీ సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో మూకుత్తి అమ్మ‌న్-2 సినిమా చేస్తున్నాడు.