థియేటర్లు కోరుకున్న జోష్ వచ్చిందా

ఇవాళ స్ట్రెయిట్, డబ్బింగ్ అన్ని భాషలు కలిపి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి. కానీ థియేటర్ల దగ్గర కోరుకున్న స్థాయిలో జోష్ కనిపించిందా అంటే సమాధానం ఎస్ అని చెప్పలేని పరిస్థితి. కారణం స్టార్ కంటెంట్ లేకపోవడమే. కమెడియన్ సత్య ‘జెట్లీ’కు చేసిన ప్రమోషన్లు ఓ మోస్తరు ఓపెనింగ్స్ తేగా పబ్లిసిటీతో ఊదరగొట్టిన ‘గాయపడిన సింహం’కు అంతో ఇంతో జనాలు కనిపించారు. అయితే హ్యాపీగా ఫీలయ్యేంత రేంజ్ లో కాదనేది ట్రేడ్ వర్గాల మాట.

వీటికి వచ్చిన టాక్స్, రివ్యూస్ ఎలా ఉన్నా వీకెండ్ ఎలా క్యాష్ చేసుకుంటాయనేది బాక్సాఫీస్ స్టేటస్ ని నిర్ణయించబోతోంది. సెలవులు ఉన్నా, కొన్ని వారాలుగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా జనం కొత్తవి రాగానే థియేటర్లకు పరిగెత్తే సీన్ కనిపించడం లేదు. ఆగి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ధనుష్ ‘కర’ సైతం వీటికి భిన్నంగా ఏమి లేదు. గత ఫ్లాపుల ప్రభావం తన ఓపెనింగ్స్ మీద స్పష్టంగా పడింది. దానికి తోడు టాక్ కూడా ఆశాజనకంగా లేకపోయింది.

బాలీవుడ్ కం మరాఠి మూవీ ‘రాజా శివాజీ’కి నగరాల మల్టీప్లెక్సుల్లో వసూళ్లు బాగున్నాయి. బిసి సెంటర్లలో పెద్దగా రిలీజ్ ఇవ్వలేదు. చావా రేంజ్ లో నిర్మాతలు ఊహించుకున్నారు కానీ హైప్ విషయంలో వెనుకబడి ఉంది. రిపోర్ట్స్ పాజిటివ్ గానే వస్తున్నాయి కానీ ఏ మేరకు నిజమో రేపటికి క్లారిటీ వస్తుంది. కన్నడ కెడి ది డెవిల్, మలయాళం పాట్రియాట్ అనువాదం ఆలస్యం కావడం వల్ల మన దగ్గర రాలేదు. ఇంకో వారం పట్టే అవకాశం ఉంది. నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు.

కౌంట్ కనిపిస్తోంది కానీ క్వాలిటీ కోసం రాజీ పడని ఆడియన్స్ వల్ల థియేటర్లు ఇంకా నిండుగా ఉండటం లేదు. ఇదే సిచువేషన్ ఇంకెంత కాలం ఉంటుందో అర్థం కాక బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. పెద్ది జూన్ 4 రాబోతున్న నేపథ్యంలో ఇంకా నెల రోజుల సమయం ఉంది. అప్పటిదాకా టికెట్ కౌంటర్లకు ఊపు నిచ్చే సినిమాలు ఏవి అవుతాయోననే ప్రశ్నకు సమాధానం మరో శుక్రవారం రోజు వెతుక్కోవాల్సిందే. సోమవారానికి జెట్లీ, గాయపడ్డ సింహం స్టేటస్ తేలనుంది.