దృశ్యం 3… కిక్కు రాలేదే

మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో దృశ్యం 3 ఉంది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తెలుగులో డబ్బింగ్ చేస్తారా లేక వెంకటేష్ డేట్స్ దొరికాక తీరిగ్గా రీమేక్ చేస్తారానేది ఇంకా తేలలేదు కానీ దీనికి సంబంధించిన కంటెంట్ కోసమైతే సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజర్ వచ్చింది. మే 21 థియేటర్ రిలీజ్ జరుపుకోబోతున్న ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మీద మల్లువుడ్ లో మాములు అంచనాలు లేవు. బిగ్గెస్ట్ ఓపెనింగ్ రావడం ఖాయం.

ఇదంతా బాగానే ఉంది కానీ టీజర్ చూశాక అధిక శాతం జనాలు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే సగం టైం కేవలం దృశ్యం, దృశ్యం 2కి సంబంధించిన ఫుటేజ్ తో నెట్టుకొచ్చి చివరిలో కొన్ని షాట్స్ మాత్రమే మూడో భాగం నుంచి చూపించారు. అది కూడా మోహన్ లాల్ చర్చిలో చెప్పే సుదీర్ఘమైన డైలాగు తప్ప ఇంకేం లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి ఎక్కువ ఇంప్రెస్ చేయలేకపోయారు.

దృశ్యం సిరీస్ లో ఇది చివరి భాగం. మోహన్ లాల్ కుటుంబం చంపేసిన కుర్రాడి శవం బయటికి తీశారా లేదా అనే ప్రశ్నకు ఇందులో సమాధానం ఇవ్వబోతున్నారు. కాకపోతే మైండ్ బ్లాంక్ చేసే ట్విస్టులతో కాకుండా ఎమోషన్స్ కి పెద్ద పీఠ చేసి చివర్లో మంచి సందేశం కూడా ఇచ్చారట. హిందీలో తీస్తున్న దృశ్యం 3కి అజయ్ దేవగన్ పూర్తిగా వేరే కథ రాయించుకున్నాడని ముంబై రిపోర్ట్. ఇది అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

ఎటొచ్చి మన రాంబాబునే చూస్తామో లేదోననే అనుమానం వెంకటేష్ అభిమానుల్లో పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆయన ఆదర్శ కుటుంబం షూటింగ్ తో వేసవి దాకా బిజీగా ఉంటారు. ఆ తర్వాత అనిల్ రావిపూడికో ఆరు నెలలు ఇవ్వాలి. అంటే సంక్రాంతి దాకా ఛాన్స్ లేదు. అప్పటికే దృశ్యం 3 హిందీ, మలయాళం రెండు వెర్షన్లు ఓటిటిలో అరిగిపోయి ఉంటాయి. అయినా సరే రిస్క్ చేసి రీమేక్ చేస్తారేమో చూడాలి. గత కొన్నేళ్లుగా జీతూ జోసెఫ్ నుంచి ఆయన స్థాయి కంటెంట్ రాలేదు. ఒక్క నీరూ మాత్రమే అంచనాలు అందుకుంది.