జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు ఇంకో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉందని చెబుతున్న నేపథ్యంలో అందరి కళ్ళు రామ్ చరణ్ పక్కన ఆడిపాడబోయే భామ ఎవరనే దాని మీద ఉన్నాయి. ముందు మృణాల్ ఠాకూర్ అన్నారు. తర్వాత మరో ఇద్దరు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. నిన్నంతా సంయుక్త మీనన్ గురించిన వార్త తెగ చక్కర్లు కొట్టింది.
తీరా చూస్తే ఇప్పుడేమో శృతి హాసన్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి గతంలో ఎవడులో జోడిగా నటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారాలు రావడం లేదు. శృతి స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్త కాదు. గతంలో మహేష్ బాబు ఆగడు, నాని హాయ్ నాన్నలో తళుక్కున మెరిసింది. ఇప్పుడు పెద్ది కోసం అడిగితే నిజంగా కాదనకపోవచ్చు.
ఈ కన్ఫ్యూజన్ తీరాలంటే ఇంకొద్ది రోజులు ఆగక తప్పేలా లేదు. యూనిట్ టాక్ మరోలా ఉంది. మే మొదటివారం దాకా ఇది షూట్ చేసే ఛాన్స్ లేదంటున్నారు. కానీ ఏదీ నిర్ధారణగా చెప్పడం లేదు. జూన్ రిలీజ్ అన్నారు కానీ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. టాక్సిక్ రాని పక్షంలో నాలుగో తేదీ తీసుకునే ఆలోచనలో నిర్మాతలున్నారు. కానీ ముందు జాగ్రత్తగా అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. ఈసారి ప్రకటన ఇస్తే వంద శాతం దానికే కట్టుబడి ఉండాల్సి వస్తుంది.
కీలకమైన సమ్మర్ ని వదులుకున్న పెద్దికి జూన్ కూడా మంచి సీజనే. ఎలాగూ పాజిటివ్ వైబ్స్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వసూళ్లకు ఢోకా ఉండదు. ఫస్ట్ హాఫ్ పూర్తి చేసిన ఏఆర్ రెహమాన్ వచ్చే నెల రెండో వారం లోగా మిగిలిన భాగం రీ రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఆలస్యమవుతున్న కారణాల్లో ఇది కూడా ఒకటి. టీజర్, రెండు పాటలు తప్ప పెద్ది నుంచి సాలిడ్ ప్రమోషన్స్ ఇంకా మొదలుకాలేదు. ముఖ్యంగా ట్రైలర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. హైప్ నిర్ణయించేది ఇదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates