తెలుగు టీవీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన షోగా జబర్దస్త్‌ను చెప్పొచ్చు. అందులో డబుల్ మీనింగ్‌లు, బాడీ షేమింగ్‌ల గురించి అభ్యంతరాలు మొదట్నుంచి ఉన్నవే కానీ.. అయినా సరే జనం ఆ కామెడీ షోకు అపూర్వ ఆదరణను కట్టబెట్టారు. గురు, శుక్రవారాలు వస్తే తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లలో రాత్రి తొమ్మిదన్నరకు ఈటీవీ ఛానెల్ రన్ అయ్యే స్థాయిలో ఆ షో పాపులర్ అయింది.
ఈ షోతో వచ్చిన గుర్తింపుతో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శీను.. ఇంకా చాలామంది కమెడియన్లు సినిమాల్లో కూడా బిజీ అయిపోయారు. ఐతే ఎలాంటి కార్యక్రమం అయినా ఎల్లకాలం ఒకేలా నడవదు. ఆదరణ తగ్గడం మామూలే. జబర్దస్త్ కూడా అందుకు మినహాయింపు కాలేదు. ఇందులోని హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శీను సహా చాలామంది కమెడియన్లు వెళ్లిపోయారు.
జడ్జీలుగా సుదీర్ఘ కాలం ఉన్న నాగబాబు, రోజా సైతం కొన్నేళ్ల ముందు షోకు గుడ్‌బై చెప్పేశారు. యాంకర్ అనసూయ సైతం షోను వదిలేసింది. దీంతో షోకు క్రమంగా ఆకర్షణ తగ్గింది.
ఐతే ఇప్పుడు ఈ షోలోకి నాగబాబు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన మళ్లీ జడ్జి స్థానంలో కూర్చోబోతున్నాడు. ఆయన జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయాన్ని ఒక వీడియో ప్రోమో ద్వారా వెల్లడించింది ఈటీవీ.
ఆయన సీనియర్ నటి ఇంద్రజతో కలిసి జడ్జిగా వ్యవహరించబోతున్నారు. ఇంతకుముందు గురు, శుక్రవారాల్లో నడిచిన జబర్దస్త్.. ఇప్పుడు శుక్ర, శనివారాల్లో ప్రసారం అవుతోంది. ఇప్పటికీ ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, చలాకీ చంటి లాంటి వాళ్లు స్కిట్లు చేస్తూ కామెడీ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ గతంతో పోలిస్తే షో రేటింగ్స్ బాగా పడిపోయాయన్నది వాస్తవం. ఈ షోలు జడ్జీలు ప్రత్యేకంగా చేసేదేముంటుంది అనిపిస్తుంది కానీ.. నాగబాబు ఉండగా షో లెవెల్ వేరుగా ఉండేదన్నది వాస్తవం. ఆయన నవ్వులు, రన్నింగ్ కామెంట్రీ ఆకట్టుకునేది. ఆయనకు జబర్దస్త్ కమెడియన్లలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి నాగబాబు రాకతో కొందరు కమెడియన్లు తిరిగి షోలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఈ షోను నాగబాబు తిరిగి పైకి లేపగలరేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates