మృణాల్‌తో సినిమా చేస్తే హీరో ఔటేనా?

సినిమాల్లో పాత్రలను కొంతమంది నిజ జీవితంలో కూడా ఎంతో ఓన్ చేసుకుంటారు. తెరపై వారికి అన్యాయం జరిగితే నిజంగానే వారికేదో నష్టం జరిగినంత ఫీలవుతారు. అలాంటి ప్రభావం చూపగలిగే పాత్రలు చాలా గొప్పవి. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ తెలుగులో అలాంటి పాత్రే చేసింది ‘సీతారామం’ చిత్రంలో.

రామ్ కోసం ఆ సినిమాలో సీత పడే తపనకు ప్రేక్షకులు ఎంతగానో కదిలిపోయారు. రామ్‌ను కోల్పోయిన సీతను చూసి చివర్లో హృదయం ద్రవించి పోతుంది. తన వల్లే ఆ సినిమాలో సీత‌కు రామ్ దూరమయ్యాడని ఆ చిత్రంలో విష్ణు శర్మ పాత్రను పోషించిన సుమంత్.. మృణాల్‌కు సారీ చెప్పిన సంగతి తెలిసిందే. 

ఐతే మృణాల్.. ఇలా తన సినిమాల్లో భర్తను కోల్పోయే పాత్ర చేయడం ‘సీతారామం’కే పరిమితం కాదు. అంతకుముందు హిందీ ‘జెర్సీ’లోనూ ( హిందీ ) అలాంటి క్యారెక్టరే చేసింది. ఇప్పుడు మృణాల్ నుంచి వచ్చిన ‘డెకాయిట్’లోనూ చివరికి తన లవర్‌ను కోల్పోతుంది.

ఇలా కెరీర్లో ఎక్కువగా భర్త లేదా లవర్‌ను కోల్పోయే పాత్రలు చేస్తున్న నేపథ్యంలో.. తన ఫ్రెండు ఒకరు తనకు ‘హజ్బెండ్ మర్డరర్’ అనే పేరు పెట్టినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది మృణాల్ ఠాకూర్. ఇలాంటి పాత్రలు ఎక్కువ అయిపోతున్న నేపథ్యంలో ఇకపై కొంచెం జాగ్రత్త పడాలేమో అన్నట్లు ఆమె వ్యాఖ్యానించింది.

మరోవైపు ‘సన్నాఫ్ సర్దార్-2’ చిత్రంలో తనకు భర్తగా పెద్ద వయస్కుడైన చుంకీ పాండేను పెట్టడం తనకు నచ్చలేదని వ్యాఖ్యానించింది మృణాల్. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన ఎమోషనల్ సీన్లు ఎడిటింగ్‌లో లేపేయడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సినిమా సరిగా ఆడకపోవడానికి ఇవే కారణాలన్నట్లు ఆమె మాట్లాడింది. తనకు ప్రేమించేంత ఖాళీ లేదని.. ఇప్పుడే పెళ్లి కూడా చేసుకోబోనని ఆమె ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది ఈ మరాఠీ అమ్మాయి.