ఎన్టీఆర్ సినిమా కోసం ధనుష్ మూవీ త్యాగం

‘సప్తసాగరాలు దాటి’ అనే చిన్న సినిమాతో రుక్మిణి వసంత్ అనే కన్నడ అమ్మాయి ఎంత మంచి పేరు సంపాదించిందో తెలిసిందే. ఆ సినిమాలో తన అందం, అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. అందులో ఆమె చేసింది గ్లామర్ రోల్ ఏమీ కాదు. కానీ చూడముచ్చటగా కనిపిస్తూ, చక్కటి అభినయాన్ని ప్రదర్శించడంతో ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు తయారయ్యారు. 

ఈ గుర్తింపు వివిధ భాషల్లో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది రుక్మిణి. ప్రస్తుతం సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీని ప్రస్తుతం తెలుగులోనే చేస్తోంది రుక్మిణి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఆ చిత్రమే.. డ్రాగన్. ముందు అనుకున్న ప్రకారమైతే ఈపాటికి ఈ సినిమా షూట్ పూర్తి అయిపోయుండాలి. జూన్‌లో రిలీజ్ అని కూడా అన్నారు.

కానీ పెద్ద సినిమాల చిత్రీకరణ ఆలస్యం కావడం, రిలీజ్ వాయిదా పడడం అన్నది ఇప్పుడు చాలా కామన్ వ్యవహారం. ‘డ్రాగన్’ కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. షూట్ ఇంకా చాలా రోజులే బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. తారక్ సహా ఈ సినిమాలో భాగమైన ఆర్టిస్టులందరూ ఇందులో స్ట్రక్ అయిపోయారు. రుక్మిణి ఈ చిత్రం కోసం ఇంకో క్రేజీ ప్రాజెక్టును వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తమిళంలో ధనుష్ హీరోగా ‘లబ్బర్ పందు’ డైరెక్టర్ తమిళరసన్ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి ముందు రుక్మిణినే కథానాయికగా అనుకున్నారు.

కానీ ఆమె నటిస్తున్న ‘డ్రాగన్’ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దాని కోసం అదనంగా బల్క్ డేట్లు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ధనుష్ సినిమాను ఆమె వదులుకోవాల్సి వచ్చింది. రుక్మిణి స్థానంలో ‘దురంధర్’తో సెన్సేషన్ అయిన సారా అర్జున్‌ను తీసుకుంటున్నారట. సారా.. బాలనటిగా తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు కథానాయికగా ఆమెకు తమిళంలో ధనుష్ చిత్రమే మొదటిది కాబోతోంది. ఆమె తెలుగులో ఇప్పటికే ‘యుఫోరియా’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.