ప్రతాప్ కష్టం చూస్తే పాపం అనాల్సిందే

ఈ శుక్రవారం అన్నీ చిన్న సినిమాలే విడుదల కాబోతున్నాయి. వాటిలో పాపం ప్రతాప్ ఒకటి. తిరువీర్ హీరోగా నటించిన ఈ కామెడీ డ్రామాకు ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ఈటీవీ విన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి లిటిల్ హార్ట్స్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. వీలైనంత పబ్లిసిటీ చేయడం ద్వారా జనాల అటెన్షన్ తీసుకునేందుకు ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. టీవీ ఆర్టిస్టు డాక్టర్ బాబు నుంచి మంచు లక్ష్మి దాకా దొరికినవాళ్లందరినీ వాడేస్తున్నారు.

రకరకాల కామెడీ వీడియోస్, ప్రోమోస్, మీమ్స్ అన్నీ చేస్తున్నారు. తనను సానుభూతితో చూసినా పర్లేదనుకుని తిరువీర్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ట్రైలర్ కట్ వచ్చిన తర్వాత కాసింత బజ్ పెరిగిన మాట వాస్తవమే. కాకపోతే అపోజిషన్ లో ఉన్న తిమ్మరాజుపల్లి టీవీ కూడా వెరైటీ ప్రచారాలతో ఆకట్టుకుంటూ ఉండటంతో దాన్ని ఫేస్ చేయడానికి ప్రతాప్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు.

ఇదంతా బాగానే ఉంది కానీ థియేటర్లు జనం లేక వెలవెలబోతున్నాయి. డెకాయిట్ ఆడుతున్న వాటిలో ఆడియన్స్ కనిపిస్తున్నారు కానీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బైకర్, రాకాసలు వీక్ డేస్ లో ఆక్యుపెన్సీల కోసం పోరాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాపం ప్రతాప్ లాంటి వాటి కోసం ఇంటి నుంచి కాలు బయట పెడతారానేది అనుమానంగానే ఉంది. అసలే ఎండలు ఒళ్ళు మండిపోయేలా చేస్తున్నాయి. మధ్యాన్నం పూట రోడ్లు నిర్మానుషంగా ఉండే పరిస్థితి నెలకొంది.

ఇంకోపక్క ఐపీఎల్ దెబ్బ కొడుతోంది. సాయంత్రమైతే చాలు జనాలు టీవీలు స్మార్ట్ ఫోన్ల మీద పడిపోతున్నారు. దీని వల్ల ఈవెనింగ్, సెకండ్ షోలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఉదయం ఎండలు, సాయంత్రం క్రికెట్ పుణ్యమాని ఏం చేయాలో అర్థం కానీ ఒత్తిడిలో పడిపోయామని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. పెద్ది లాంటి పెద్ద సినిమా ఏదైనా పడి ఉంటే ఈపాటికి ఓవర్ ఫ్లోస్ తో వేరే సినిమాలు కూడా లాభపడేవని, కానీ మార్చి, ఏప్రిల్ స్టామినా ఇలా వృథా కావడం పట్ల కలవరం చెబుతున్నారు.