టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో ఎంట్రీ గురించి రెండేళ్ల ముందే అనౌన్స్‌మెంట్ వచ్చింది. హరికృష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు అయిన నందమూరి తారక రామారావు (తన షార్ట్ నేమ్ కూడా ఎన్టీఆర్‌యే)ను సీనియర్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేయబోతున్నట్లు 2024లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా అనౌన్స్‌మెంట్ టైంలో కూడా వైవీఎస్ చాలా హంగామానే చేశారు. హీరో హీరోయిన్లకు సంబంధించి వేర్వేరుగా వీడియోలు రిలీజ్ చేశారు. సినిమా గురించి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఇది తెలుగుదనం ఉట్టిపడే సినిమా అని.. తెలుగు భాష, సంస్కృతి గురించి ప్రపంచానికి చెప్పే చిత్రమని ప్రకటించారు. కానీ ప్రారంభానికి ముందు ఇంత హడావుడి చేశారే కానీ.. ఆ తర్వాత సినిమా గురించి సౌండే లేదు.
అసలు ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిందా.. షూటింగ్ జరుగుతోందా.. చిత్రీకరణ ఏ దశలో ఉంది.. విడుదల ఎప్పుడు.. ఇలా ఏ సమాచారం బయటికి రావడం లేదు. ఏడాదిగా ఈ సినిమా అసలు వార్తల్లోనే లేదు. హీరో కొత్త వాడే అయినా.. నందమూరి లాంటి పెద్ద కుటుంబానికి చెందిన కుర్రాడు. కాబట్టి ఆ ఫ్యామిలీ బ్యాకప్ తనకు ఉంటుంది.
తన అరంగేట్ర సినిమాను పట్టించుకోకుండా వదిలేసే అవకాశం లేదు. తమ సోదరుడి కొడుకు విషయంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా దృష్టిసారిస్తూనే ఉండొచ్చు. అయినా ఈ సినిమా ఊసులేవీ వినిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే వైవీఎస్ ఒకప్పుడు హరికృష్ణకు పెద్ద బ్రేక్ ఇచ్చి ఉండొచ్చు.. రామ్‌ను హీరోగా నిలబెట్టి ఉండొచ్చు.. కానీ చాలా ఏళ్ల నుంచి ఆయన ఫామ్‌లో లేడు.
చివరగా తీసిన రేయ్ సినిమా పరిస్థితి ఏంటో తెలిసిందే. ఇప్పుడున్న ఫామ్‌లో వైవీఎస్ బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించగలరా లేదా అనే ఆలోచనలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. బహుశా ఆ కారణంతోనే సినిమాను హోల్డ్‌లో పెట్టేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. లేని పక్షంలో ఇంత కాలం వైవీఎస్ సైలెంటుగా ఉండే అవకాశం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates