బాలయ్య డైరెక్టర్ మళ్లీ బాంబేకు?

తెలుగు దర్శకులు బాలీవుడ్‌కు వెళ్లి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగ.. ఇలా చాలామంది దర్శకులు బాలీవుడ్లో తమ ఆధిపత్యాన్ని చాటారు. చివరగా తెలుగు నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన దర్శకుడు గోపీచంద్ మలినేని.

అతను బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్‌‌ను లీడ్ రోల్‌లో పెట్టి ‘జాట్’ సినిమా తీశాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.
గత ఏడాది ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా సన్నీ డియోల్ పెట్టిన పోస్టు.. దానికి గోపీచంద్ మలినేని ఇచ్చిన బదులు చర్చనీయాంశంగా మారాయి.

గోపీచంద్ మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లబోతున్నాడని.. ‘జాట్-2’ తీయబోతున్నాడని అనిపిస్తుంది ఈ పోస్టులు చూస్తే.
గోపీచంద్ మలినేని విజన్ సూపర్ అని, అతను ఎంతో పవర్‌ఫుల్‌గా ‘జాట్’ ప్రపంచాన్ని తెరపై ప్రెజెంట్ చేశాడని కొనియాడిన సన్నీ డియోల్.. మళ్లీ మనం చేతులు కలపాల్సిన సమయం ఆసన్నం అయిందని వ్యాఖ్యానించాడు. దీనికి గోపీచంద్ బదులిస్తూ.. సినిమాలో సన్నీడియోల్ పెర్ఫామెన్స్ గురించి ఎలివేషన్ ఇస్తూ, ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎలా సెలబ్రేట్ చేశారో గుర్తు చేసుకున్నాడు గోపీచంద్.

అంతే కాక సన్నీతో మళ్లీ కలిసి పని చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు.
‘జాట్’కు సీక్వెల్ వస్తుందని గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. కానీ ఈ చిత్రాన్ని గోపీచంద్ డైరెక్ట్ చేయడని.. వేరే దర్శకుడి చేతుల్లో ఈ ప్రాజెక్టును పెడుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ సన్నీ, గోపీచంద్ మధ్య తాజా సంభాషణ చూస్తుంటే.. సీక్వెల్‌ను కూడా ఈ తెలుగు దర్శకుడే రూపొందిస్తాడని స్పష్టమవుతోంది. ప్రస్తుతం గోపీచంద్.. నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక జాట్-2ను పట్టాలెక్కిస్తాడేమో చూడాలి.