హఠాత్తుగా కోలీవుడ్ వర్గాల్లో ఒక పుకారు మొదలైపోయింది. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ క్యామియో చేయడం లేదని దాదాపు ఖరారు కావడంతో ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ వస్తాడని, ఆమేరకు అంగీకారం కూడా అయిపోయిందని చెన్నై మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఇక్కడో బేసిక్ లాజిక్ మిస్సవుతున్నారు. పవన్ గెస్టు రోల్స్ కు ఎప్పుడు సుముఖంగా లేరు. ఒక్క చిరంజీవికి మాత్రమే మినహాయింపు ఇచ్చి శంకర్ దాదా ఎంబిబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో కనిపించారు.
ఇవి తప్ప అతిథి పాత్రలకు ఎప్పుడూ ఎస్ చెప్పలేదు. ఇప్పుడు రజనీకాంత్ కోసం సరేనంటారా అంటే నూటికి తొంభై శాతం నో అనే సమాధానమే వస్తుంది. ప్రస్తుతానికి ఇది పుకారు దశలోనే ఉంది కానీ టాలీవుడ్ ఫ్యాన్స్ అయితే నమ్మడం లేదు. పవన్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం జైలర్ 2 మేకర్స్ కలిసిన మాట నిజమే కానీ ఒప్పుకోలేదని అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ పోయాక పవన్ కు సినిమాల మీద ఫోకస్ తగ్గినట్టు కనిపిస్తోంది. సురేందర్ రెడ్డి మూవీ ఎప్పుడు మొదలుపెడతారనే క్లారిటీ ఇవ్వలేదు. గెటప్ అయితే రెగ్యులర్ గా కొత్తదే మైంటైన్ చేస్తూ బాగా గెడ్డం పెంచేశారు.
సో జైలర్ 2 గాసిప్ మీద ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కొత్త క్యామియోలను చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నారట. కానీ ఎవరిని అడిగినా భారీ రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తుండటంతో నిర్మాత ఆ విషయంలో వెనుకడుగు వేస్తున్నట్టు వినికిడి. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఎలాగూ కొనసాగుతున్నారు కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళు అవసరమా అనేది ఆయన వాదనగా చెబుతున్నారు. నిజానిజాలు ఇంకా బయటికి రావాలి.
ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెలలో జైలర్ 2 రావడం గురించి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికైతే ప్రొడక్షన్ హౌస్ నుంచి అనౌన్స్ మెంట్ రాలేదు. షూటింగ్ అయిపోయిందని రజనీకాంత్ సంకేతం ఇస్తున్నారు కానీ ఇంకొంచెం బాలన్స్ ఉందని యూనిట్ టాక్. ఏదైతేనేం పవన్ కళ్యాణ్ లేడనేది కన్ఫర్మ్ కానీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ కలయిక సాధ్యం కాకపోవచ్చు. ఫ్యాన్స్ మాత్రం స్వంత సినిమాలనే సీరియస్ గా తీసుకోలేనంత బిజీగా ఉన్న పవన్ గెస్టుగా చేసే ఛాన్స్ లేదంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates