రష్యా అమ్మాయి అయిన అనా కొణిదల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకోవడం.. మెగా కుటుంబంలో సులువుగా కలిసిపోవడం.. భర్తకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడి సంస్కృతిని అలవరుచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. గత ఏడాది తన కొడుకు కొణిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ నేపథ్యంలో ఆమె తిరుమలకు వెళ్లి గుండు కూడా కొట్టించుకోవడం చర్చనీయాంశం అయింది.
అనా.. పవన్‌కు, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌కి పుట్టిన పిల్లల విషయంలో కూడా ఎంతో ప్రేమతో వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె అకీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. అకీరా పుట్టిన రోజే.. పవనోవిచ్ సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కాబట్టి తమకు ఏప్రిల్ 8.. చాలా భావోద్వేగంతో కూడుకున్న రోజు అంటూ ఆమె ఈ పోస్టులో పేర్కొన్నారు.
అకీరా ఎదుగుతున్న తీరు చూసి గర్వపడుతున్నామని.. అతను ఏ విషయాన్నయినా లోతుగా ఆలోచిస్తాడని కొనియాడారు అనా. కొత్త విషయాల పట్ల అకీరా కుతూహలం కనబరుస్తాడని, ఇది తనలో మంచి లక్షణమని పేర్కొన్నారు. మరోవైపు మార్క్ అగ్నిప్రమాదం నుంచి బయటపడి ఈ రోజుకు సరిగా సంవత్సరం అయిందని.. ఇది అతడికి నిజంగా పునర్జన్మ అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ రోజు తమ ఇద్దరు అబ్బాయిల పుట్టిన రోజును జరుపుకుంటున్నామని, అందుకే ఇది తమకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్న రోజని ఆమె చెప్పారు. మార్క్ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రిలో బెడ్ పక్కన కూర్చుని బాధ పడ్డ రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని.. ఏ తల్లికీ అలాంటి పరిస్థితి రాకూడదని అనా వ్యాఖ్యానించారు. మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ జరిపిన అనా.. పవన్, మీలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారని అడిగితే పవనే అని చెప్పడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates