జూన్ 25 పెద్ది… SKN స్లిప్పయ్యారా

రిలీజ్ డేట్ల వ్యవహారం భలే మలుపులు తిరుగుతోంది. నిన్న లెనిన్ టీమ్ తమ విడుదల తేదీని జూన్ 26కి వాయిదా వేస్తూ దానికి కారణంగా పెద్దిని చూపించారు. కట్ చేస్తే ఇప్పుడు పెద్ది ఏప్రిల్ 30 రావడం లేదు. ఏకంగా జూన్ 25కి వెళ్లిపోయిందని ఫిలిం నగర్ ప్రచారం జోరుగా ఉండటంతో ఇప్పుడు లెనిన్ ఏం చేస్తాడనే దాని మీద అక్కినేని ఫ్యాన్స్ తర్జన భర్జన పడుతున్నారు. సితార, అన్నపూర్ణ సంస్థలు ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనం పాటించబోతున్నాయి.

ఇవాళ జరిగిన చెన్నై లవ్ స్టోరీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్కెఎన్ మాట్లాడుతూ పెద్ది విడుదల జూన్ 25 ఉంటుందని చెప్పేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఎందుకంటే ఆయన ఏ కోణంలోనూ పెద్ది ప్రాజెక్టుకు సంబంధం లేని మనిషి. అలాంటిది అంత పబ్లిక్ గా మీడియా మొత్తం హాజరైన ఈవెంట్ లో మైకులో అలా చెప్పేయడం విచిత్రం. ఎందుకంటే వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థల నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి.

అసలు జూన్ 25 ఆప్షన్ పెద్ది మేకర్స్ దగ్గర ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పెద్ది అంతకంత లేట్ కావడం అన్ని వర్గాల్లో అసహనం కలిగిస్తోంది. ఇప్పుడు ఎస్కెఎన్ పేల్చిన బాంబు వల్ల నిర్మాతలు వీలైనంత త్వరగా కొత్త తేదీని ప్రకటించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఒకవేళ జూన్ 25 పక్కా అనుకుంటే అదేదో చెప్పేస్తే బెటర్. లెనిన్ లాంటివి నిర్ణయాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇదంతా మెల్లగా నెగటివిటీ తెచ్చే ప్రమాదాన్ని పెద్ది దర్శక నిర్మాతలు గుర్తించాలి. ఏదైనా ప్రెస్ మీట్ రూపంలో వీటికి క్లారిటీ ఇస్తే మరీ మంచిది. కానీ ప్యాన్ ఇండియా మూవీస్ ఇలా చేయడం అరుదు కాబట్టి దాన్ని ఆశించలేం. కనీసం నోట్ రూపంలో అయినా సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్ ఇస్తే ఈ గోల తగ్గుతుంది. ఆల్రెడీ ఎస్కెఎన్ చేసిన డ్యామేజ్ చాలు. ఏ ఆధారంతో ఆయన అంత ఓపెన్ గా డేట్ చెప్పారని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం సమాధానం వస్తుందో.