పెద్దికి కొత్త డేట్… అసలైన కారణం వేరే

అనుమానాలే నిజం కాబోతున్నాయి. గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని నిజం చేస్తూ పెద్ది సినిమాను మ‌రోసారి వాయిదా వేయ‌బోతున్నారు మేక‌ర్స్. వాయిదా గురించి పెద్ది టీం నుంచే మీడియాకు, సోష‌ల్ మీడియాకు లీక్స్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. స్పంద‌న చూసి టీం బెంబేలెత్తిపోతూ ఉంటే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.

ఇటీవ‌లే చర‌ణ్ పుట్టిన రోజుకు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఏప్రిల్ 30న రిలీజ్ అని నొక్కి వ‌క్కాణించి, ఇంత‌లో వాయిదా అంటే మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? కానీ పెద్ది టీంకు మ‌రో మార్గం లేదు. ఏప్రిల్ 30కి సినిమాను రెడీ చేసే అవ‌కాశం ఎంత‌మాత్రం లేక‌పోవ‌డంతో వాయిదా త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. మ‌రి కొత్త డేట్ ఏద‌న్న‌ది స‌స్పెన్స్.

టీం నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం మేలో కూడా సినిమా రిలీజ‌వ్వ‌దు. జూన్ 25కు ఈ చిత్రాన్ని ఖాయం చేసిన‌ట్లు తెలుస్తోంది. పెద్ది వ‌స్తోంద‌ని మే 1 నుంచి లెనిన్ మూవీని జూన్ 26కు వాయిదా వేయ‌గా.. మ‌ళ్లీ ఆ సినిమా రావ‌డానికి ఒక్క రోజు ముందు పెద్దిని ఫిక్స్ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. అంటే పెద్ది ఆ డేట్‌కు ఖాయ‌మైతే.. లెనిన్ మ‌ళ్లీ డేట్ మార్చుకోక త‌ప్ప‌ద‌న్న‌మాట‌. అన్నీ ఆలోచించాకే పెద్ది సినిమా కొత్త డేట్‌ను ఖాయం చేసిన‌ట్లు స‌మాచారం. కాబ‌ట్టి ఈ డేట్ ఫిక్స్ అనుకోవ‌చ్చు.

పెద్ది వాయిదాకు ప్ర‌ధాన కార‌ణం.. గ్రాఫిక్ వ‌ర్క్ ఆల‌స్యం అవుతుండ‌డ‌మే. సినిమా చివ‌రి 40 నిమిషాల్లో విజువ‌ల్ ఎఫెక్ట్స్ అవ‌స‌రం ఎక్కువ‌గా ఉండ‌బోతోంది. క‌థ‌లో వ‌చ్చే కీల‌క మ‌లుపు వ‌ల్ల వీఎఫెక్స్‌కు ప్రాధాన్యం ఉండ‌బోతోంది. అది అంత ఈజీగా చేసే వ‌ర్క్ కాదు. టైం ప‌డుతుంది.

ప‌ర్ఫెక్ట్‌గా చేయ‌క‌పోతే ఔట్ పుట్ తేడా కొట్టి సినిమా ఫ‌లిత‌మే మారిపోవ‌చ్చు. అందుకే టైం తీసుకుని జాగ్ర‌త్త‌గా చేయాల‌ని టీం భావిస్తోంది. పెద్ది కొత్త రిలీజ్ డేట్ గురించి ఇంకో మూడు రోజుల్లో ప్ర‌క‌ట‌న రాబోతోంద‌ని స‌మాచారం. వాయిదాకు కార‌ణ‌మేంటో చెబుతూ.. కొత్త రిలీజ్ డేట్ గురించి ప్ర‌క‌ట‌న చేస్తార‌ట‌.