టిల్లు వివాదానికి దర్శకుడి ముగింపు

డిజె టిల్లు ఒక బ్రాండ్ గా మారిపోయేంత రేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇది అందరూ ఒప్పుకునే వాస్తవం. ఆ కారణంగానే టిల్లు స్క్వేర్ కి క్రేజ్ తో పాటు మంచి ఓపెనింగ్స్, విజయం దక్కాయి. అయితే ఫస్ట్ పార్ట్ తీసిన దర్శకుడు విమల్ కృష్ణ స్థానంలో సీక్వెల్ కి మల్లిక్ రామ్ రావడంతో అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. హీరో, దర్శకుడి మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే మార్పు జరిగిందని ప్రచారం మొదలయ్యింది. కానీ క్లారిటీ తీసుకునే అవకాశం రాలేదు.

నాలుగు సంవత్సరాల తర్వాత దీనికి స్పష్టత దొరికింది. విమల్ కృష్ణ తీసిన అనుమాన పక్షి త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డీజే టిల్లు ప్రస్తావన వచ్చింది. క్రెడిట్ విషయంలో సిద్దు జొన్నలగడ్డ, నేను ఎప్పుడూ సమానంగానే ఫీలవుతామని, ఒకరు ఎక్కుడ మరొకరు తక్కువ అనే ఫీలింగ్ ఇద్దరిలోనూ లేదని తేల్చి చెప్పారు. అనవసరమైన ప్రచారాలు జరిగాయి తప్ప తమ మధ్య ఎలాంటి అపార్థాలు లేవని విమల్ కృష్ణ వివరణ ఇచ్చారు.

ఇదే వెర్షన్ సిద్ధూ జొన్నలగడ్డ నుంచి వస్తుందా రాదానేది పక్కన పెడితే మొత్తానికి టిల్లు టాపిక్ కు బ్రేక్ అయితే పడింది. విచిత్రంగా టిల్లు సక్సెస్ తర్వాత ఇద్దరికీ సరైన బ్రేక్ త్రూ దొరకలేదు. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ వరసగా జాక్, తెలుసు కదా రూపంలో రెండు డిజాస్టర్లు చూశాడు. బ్యాడ్ యాస్ పెండింగ్ లో పెడితే కోహినూర్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు స్వరూప్ తో వేరే సబ్జెక్టుతో సినిమా చేస్తున్నాడు. ఇక విమల్ కృష్ణ నుంచి ఇంత గ్యాప్ లో మరో థియేటర్ సినిమా రాలేదు.

ఏది ఏమైనా ఇలాంటి వాటికి ఆదిలోనే చెక్ పడితే ఎలాంటి సమస్యలు ఉండవు. అందులోనూ డీజే టిల్లు లాంటి బ్రాండెడ్ మూవీస్ కు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్నా అనుమానమైనా చాలా దూరం వెళ్తుంది. ఇంత గ్యాప్ తర్వాత ఎక్స్ ప్లనేషన్ ఇవ్వడం బాగానే ఉంది కానీ అదేదో ముందే చేసి ఉండాల్సిందనే కామెంట్ ని కొట్టి పారేయలేం. అనుమాన పక్షిలో రాగ మయూర్ హీరో. ఇమేజ్ లేని ఇలాంటి అప్ కమింగ్ హీరోతో విమల్ కృష్ణ మళ్ళీ ఋజువు చేసుకుంటారేమో చూడాలి.