లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజవుతున్న పేరున్న తెలుగు సినిమా అంటే ‘సోలో బ్రతుకే సో బెటర్’యే. వర్మ గారి ‘కరోనా వైరస్’ ఇంతకుముందే రిలీజైంది కానీ.. దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాబట్టలేదంటే.. ఆ చిత్రాన్ని మన ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఐతే తేజు సినిమాకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే కనిపిస్తోంది.
తొమ్మిది నెలలకు పైగా థియేటర్లకు దూరంగా ఉన్న ప్రేక్షకుల్లో చాలామంది ఇప్పుడు మళ్లీ అటు వైపు అడుగులేసేలా ఉన్నారు. ఇటీవలే ‘సోలో బ్రతుకే సో బెటర్’కు బుకింగ్స్ ఓపెన్ చేయగా.. టికెట్లు బాగానే తెగుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో యాభై శాతం టికెట్లను మాత్రమే అమ్ముతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లాంటి చోట పేరున్న థియేటర్లలో ‘సోలో బ్రతుకే సో బెటర్’కు హౌస్ ఫుల్స్ పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బుకింగ్ ట్రెండ్స్ అయితే ఆశాజనకంగానే ఉన్నాయి.
ప్రస్తుతం థియేటర్లలో మరే పేరున్న సినిమా లేకపోవడం, అసలు పోటీకి అవకాశమే లేకపోవడం తేజుకు కలిసొస్తోంది. ఒక్కో షో ద్వారా, థియేటర్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గొచ్చు కానీ.. తేజు కెరీర్లోనూ ఎన్నడూ లేని స్థాయిలో ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం వల్ల రికవరీకి అవకాశాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ విషయానికొస్తే అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఈ నెల 4 నుంచి దశల వారీగా థియేటర్లను తెరుస్తుండగా.. అందులో మెజారిటీ థియేటర్లలో ప్రదర్శితం కానున్న తొలి చిత్రం ‘సోలో..’నే. ఈ సినిమాతోనే చాలా వరకు సింగిల్ స్క్రీన్లు తెరుచుకున్నాయి. తెలంగాణలోని మిగతా నగరాలు, పట్టణాల్లో.. అలాగే ఏపీలో థియేటర్లలో చాలా వరకు తేజు సినిమాతోనే పున:ప్రారంభం అవుతున్నాయి. దీని వల్ల తేజు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతోంది. మరి ఇండస్ట్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.