విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ జాక్ పాట్ లాంటి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇన్ సైడ్ టాక్ అయితే బలంగా ఉంది. మాములుగా డైరెక్టర్ ఎవరైనా రెండు డిజాస్టర్ల తర్వాత ఇంకో మూవీ దక్కించుకోవడం అంత సులభం కాదు. అందులోనూ టయర్ వన్ స్టార్లు ఆచితూచి అడుగులు వేస్తున్న ఇలాంటి టైంలో మరీ కష్టం. కానీ పూరి బ్రాండ్, ఆయన మీద ఉన్న నమ్మకం అనుకోని కలయికలను సాధ్యం చేస్తోంది. వాటిలో భాగంగానే సూర్యతో ఓకే అయ్యుండొచ్చు.
ఇంకా అఫీషియల్ నోట్ రాలేదు కాబట్టి ఖరారు చేయలేం కానీ సోర్స్ అయితే నమ్మశక్యంగానే ఉంది. ప్రస్తుతం స్లమ్ డాగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ కం క్రైమ్ డ్రామాలో కన్నడ హీరో దునియా విజయ్ మెయిన్ విలన్ గా నటించగా టబు ఒక ముఖ్య పాత్ర పోషించారు. థియేటర్ బిజినెస్, ఓటిటి వ్యవహారాలు కొంత ఆలస్యం కావడంతో రిలీజ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ వేసవిలోనే అనుకూలమైన డేట్ చేసుకుని పోటీ లేకుండా తమిళ తెలుసు భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూరి దాంట్లోనే బిజీగా ఉన్నారు.
స్లమ్ డాగ్ హిట్టవుతుందనే నమ్మకం ఆయన అభిమానుల్లో బలంగా ఉంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయినప్పటికీ వాటిలో జరిగిన పొరపాట్లు ఏంటో పూరి గుర్తించడం వల్లే స్లమ్ డాగ్ ని జాగ్రత్తగా రాసుకున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇదే కనక నిజమైతే బిజినెస్ మెన్ రేంజ్ లో మరో కంటెంట్ ఆశించవచ్చు. ఏది ఏమైనా ఫ్లాపుల పర్వంలో ఉన్న వింటేజ్ దర్శకులకు ఛాన్సులు రావడం కష్టమైపోయిన తరుణంలో పూరి ఇలా క్రేజీ కాంబోలు సెట్ చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. సూర్య ప్రస్తుతం కరుప్పు రిలీజ్ కోసం ఎదురుచూస్తుండగా వెంకీ అట్లూరి సినిమా చివరి దశకు చేరుకుంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates