జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఒక కల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయిన అదుర్స్ వచ్చి పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడప్పుడు దీని కొనసాగింపు ప్రస్తావన వస్తూనే ఉంటుంది.
తాజాగా బ్యాండ్ మేళం ఈవెంట్ లో రచయిత కోన వెంకట్ దీని గురించి క్లారిటీ ఇస్తూ తారక్ చేస్తున్న రెండు కమిట్ మెంట్స్ అవ్వగానే ఇది వినిపిస్తామని, తొలి అరగంట వెర్షన్ సిద్ధంగా ఉందని ఇటీవలే వివి వినాయక్ చెప్పాడని, మిగిలింది రెడీ చేస్తామని అన్నారు. అంటే దశాబ్దంన్నర కాలంలో ఒక సీక్వెల్ కి ఫుల్ స్టోరీ రాయలేకపోవడం ఏమిటని అభిమానుల్లో సందేహం రావడం సహజం. దానికి సమాధానం దొరకడమూ కష్టం.
ఇక్కడ ప్రాక్టికల్ గా చూడాల్సిన అంశం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్, దేవర బ్లాక్ బస్టర్లతో ప్యాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెంచుకున్నాడు. లార్జర్ దాన్ లైఫ్ పాత్రల్లో తప్ప రెగ్యులర్ క్యారెక్టర్లలో తనను చూడటం ఇబ్బంది కావొచ్చు.
పైగా ఇప్పుడు తను కేవలం తెలుగుకే పరిమితం కాదు కాబట్టి మల్టీ లాంగ్వేజెస్ ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అదుర్స్ ఈ క్యాటగిరీలోకి రాదు. అలాంటప్పుడు పార్ట్ 2 ఎలా సాధ్యమనేది ఆలోచించుకోవాలి. పైగా వివి వినాయక్ డైరెక్షన్ కు చాలా కాలం నుంచి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నా తారక్ ఎస్ అంటాడన్న గ్యారెంటీ లేదు.
ప్రతిసారి అదుర్స్ 2ని ఒక కార్డులా ప్రమోషన్లలో వాడుకోవడం తప్పించి నిజంగా జరిగే అవకాశాలు లేవనే చెప్పొచ్చు. ఏ సీక్వెల్ అయినా సరే సినిమా వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లో కొనసాగింపు వచ్చేయాలి. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప చేసింది అదే. దురంధర్ ఇంకో అడుగు ముందుకు వేసి కేవలం నాలుగు నెలల గ్యాప్ లో రెండో భాగంతో వస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా 2010 నాటి కామెడీ టైమింగ్, ఆడియన్స్ అభిరుచులు వర్తమానంలో బాగా మారిపోయాయి. ఇప్పటి జనరేషన్ టేస్ట్ ని మ్యాచ్ చేయడం సులభం కాదు. కాబట్టి అదుర్స్ 2 జస్ట్ మాటల దగ్గరే ఆగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates