తెలుగు సినిమాలకు మార్కెట్ పరంగా అతి పెద్ద ఏరియా అయిన నైజాంలో ఉన్నట్లుండి కొత్త కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు మొదలు కావడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏరియాలో ఎన్నో ఏళ్ల నుంచి దిల్ రాజు, సునీల్ నారంగ్, సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాతలే ఎక్కువగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. మెజారిటీ థియేటర్లు కూడా వీరి చేతుల్లోనే ఉన్నాయి.
వీరికి పోటీగా వేర్వేరు సమయాల్లో అభిషేక్ నామా, వరంగల్ శీను లాంటి కొత్త డిస్ట్రిబ్యూటర్లు తెరపైకి వచ్చి, చాలా అగ్రెసివ్‌గా సినిమాలను కొనడం, ఫ్యాన్సీ రేట్లు ఇవ్వడం ద్వారా తమ ఉనికిని చాటాలని ప్రయత్నించారు. కానీ ఎక్కువ కాలం వారి ఆధిపత్యం సాగలేదు.
కొన్ని గట్టి ఎదురు దెబ్బలు తగలడం, థియేటర్ల మీద పట్టు లేకపోవడం లాంటి కారణాలతో వాళ్లు రేసు నుంచి తప్పుకొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థను నడిపిస్తున్న రవిశంకర్, నవీన్ ఎర్రేని సైతం కొన్నేళ్ల ముందు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకున్నా సరే.. వాళ్లు కూడా తడబడుతూనే ఉన్నారు. సంక్రాంతికి ‘రాజాసాబ్’ రిలీజైనపుడు వాళ్లు పడ్డ ఇబ్బంది ఎలాంటిదో అందరూ చూశారు.
ఐతే ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ పూర్తి స్థాయి డిస్ట్రిబ్యూషన్లోకి అడుగు పెట్టి కొత్త ఆఫీస్ మొదలుపెట్టింది. పెద్ద స్థాయిలో పెట్టబడులు పెడుతోంది. వరుసగా సినిమాలు కొంటోంది. ధీరజ్ మొగిలినేని సైతం కొత్తగా ఆఫీస్ తెరిచారు. ఇంకా రెండు మూడు కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు రంగంలోకి దిగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ థియేటర్ల మీద మంచి గ్రిప్ ఉండి, నిలకడగా విజయాలు అందుకుంటేనే ఎవ్వరైనా ఈ రంగంలో మనగలరు.
పోటీ లేనపుడు ఇబ్బంది ఉండదు కానీ.. ఒకేసారి ఎక్కువ సినిమాలు రిలీజైనపుడు థియేటర్లను చేజిక్కించుకోవడం, అలాగే ఒకట్రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలినపుడు తట్టుకుని నిలబడడం ఎంతో కీలకం.
ఈ రెండూ సాధ్యం కాకే అభిషేక్, వరంగల్ శీను లాంటి వాళ్లకు కనుమరుగైపోయారు. అన్నపూర్ణ వారైనా, ధీరజ్ అయినా.. ఇంకొకరైనా ఏమేర కన్సెస్టెన్సీ మెయింటైన్ చేస్తారు.. ముఖ్యంగా థియేటర్ల మీద ఎంతమేర పట్టు సాధిస్తారు అన్నది వారి సక్సెస్‌ను నిర్ణయిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates