బాలీవుడ్ టాప్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ తరచుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాడు. సినిమా, సినిమాయేతర విషయాలతో ఆయన చర్చనీయాంశంగా మారుతుంటాడు. ఈ మధ్య అయితే తనకు సంబంధం లేని విషయాల్లో సైతం కరణ్ సోషల్ మీడియాకు టార్గెట్‌గా మారిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం కరణ్ జోహార్‌ను నెటిజన్లు తరచుగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి కరణ్ వార్తల్లోకి వచ్చారు.
సుశాంత్ మరణంపై విచారించే క్రమంలో బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ గురించి బయటపడటం.. దానిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సీరియస్‌గా దృష్టిసారించడం తెలిసిందే. బాలీవుడ్ డ్రగ్ రాకెట్లో కరణ్ కీలక పాత్రధారి అని, ఆయన ఆధ్వర్యంలో జరిగే పార్టీల్లో విస్తృతంగా డ్రగ్స్ సరఫరా అవుతాయని ఆరోపణలు వినిపించాయి.
కాగా ఇప్పుడు డ్రగ్స్ విషయమై ఎన్సీబీనే నేరుగా కరణ్ జోహార్‌కు నోటీసులు ఇచ్చింది. 2019లో కరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ పార్టీకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. సుశాంత్ మరణానంతరం కొన్ని రోజులకు బాలీవుడ్ తారలకు సంబంధించిన ఒక పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, విక్కీ కౌశల్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ తదితరులు అందులో అదో రకంగా కనిపించారు. వాళ్లందరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా సందేహాలు వ్యక్తమయ్యాయి.
సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించిన ఈ వీడియో గురించే ఇప్పుడు ఎన్సీబీ వివరాలు కోరింది. నేరుగా కరణ్‌కు నోటీసులు ఇచ్చింది. ఆ పార్టీలో పాల్గొన్న వాళ్లలో చాలామంది డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానంతోనే కరణ్‌కు నోటీసులు ఇచ్చినట్లుంది ఎన్సీబీ. ఈ నేపథ్యంలో కరణ్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంను గుర్తు చేస్తూ.. అతను ‘కాఫీ విత్ ఎన్సీబీ’ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates