ఆశలు రేకెత్తిస్తున్న ప్రేమికుల రోజు పోటీ

సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోయింది. ఐదు సినిమాలు రిలీజైతే.. ఒకటి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. రెండు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఒకటి యావరేజ్‌గా ఆడింది. ఒక్క చిత్రమే ఫ్లాప్ అయింది. దానికి కూడా ఉన్నంతలో బాగానే వసూళ్లు వచ్చాయి. కానీ సంక్రాంతి సినిమాల తర్వాత బాక్సాఫీస్ ఎప్పట్లాగే డల్ అయిపోయింది. ఒక వారం ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఇంకోవారం ‘ఓం శాంతి శాంతి శాంతి:’ సినిమా వచ్చినా నిలబడలేదు. 

ఇక గత వీకెండ్లో అరడజనుకు పైగా తెలుగు చిత్రాలు రిలీజయ్యాయి కానీ.. దేనికీ సరైన స్పందన లేదు. ‘శ్రీ చిదంబరం గారు’ మంచి సినిమా అని పేరొచ్చినా.. వసూళ్లు ఆశించినట్లుగా లేవు. గుణశేఖర్ సినిమా ‘యుఫోరియా’, నవీన్ చంద్ర మూవీ ‘హనీ’ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మిగతా తెలుగు చిత్రాల గురించి మాట్లాడుకోవడానికేమీ లేదు. ఐతే తర్వాతి వీకెండ్ మాత్రం ఆశాజనకంగా కనిపిస్తోంది.

వేలంటైన్స్ డే వీకెండ్లో మూడు ప్రామిసింగ్ సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది విశ్వక్సేన్ మూవీ ‘ఫంకీ’ గురించి. ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘ప్రిన్స్’తో కంగుతిన్న అతను.. ‘ఫంకీ’తో బౌన్స్ బ్యాక్ అవుతాడనిపిస్తోంది. ‘జాతిరత్నాలు’ తరహాలోనే తన మార్కు ఫన్ బాగా వర్కవుట్ అయినట్లుంది. సంక్రాంతి చిత్రాల తర్వాత ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా ఇదే అవుతుందనిపిస్తోంది. 

ఇక వరుస ఫ్లాపుల నేపథ్యంలో సంతోష్ శోభన్ రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అతడి సరసన మానస వారణాసి నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించాడు. ఇది కచ్చితంగా సంతోష్‌కు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది.

ఇక సీనియర్ హీరో అర్జున్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సీతాపయనం’ కూడా హృద్యమైన సినిమాలా కనిపిస్తోంది. దీని ట్రైలరూ బాగుంది. మంచి ఉద్దేశాలతో సినిమా చేసినట్లున్నాడు అర్జున్. మొత్తంగా మూడు చిత్రాలూ ఆశాజనకంగా కనిపిస్తుండడంతో వేలంటైన్స్ డే వీకెండ్లో బాక్సాఫీస్ కళకళలాడేలా ఉంది.