హీరోలకు దర్శకులు లైఫ్ ఇస్తారా

మాములుగా ఈ స్టేట్ మెంట్ పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఫలానా నటుడు స్టార్ కావడానికి ఒక దర్శకుడు కారణమనే రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. కొందరు ఒప్పుకుంటారు కూడా. అలాని అందరికీ ఇది అన్వయించదు.

రామ్ గోపాల్ వర్మ కనక శివ తీసుండకపోతే నాగార్జునకు ఇంకొంత ఆలస్యంగా వేరే బ్లాక్ బస్టర్ దొరికేది తప్ప స్టార్ కాకుండా పోరు. మగధీర ఇచ్చిన బ్రేక్ వల్లే రామ్ చరణ్ అంత పెద్ద స్థాయికి చేరుకున్నాడని అనలేం. రకరకాల కోణాలు, కారణాలు ఉంటాయి. ఈ విషయం గురించి విశ్వక్ సేన్ కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పాడు. ఫంకీ విడుదల సందర్భంగా ఈ టాపిక్ ప్రస్తావనకు వచ్చింది.

ఎవరైనా దర్శకుడు తన వల్లే ఒక హీరోకి జీవితం దొరికిందని చెప్పడం కన్నా తప్పు మాట మరొకటి ఉండదని, అసలు అలా అన్న వాళ్ళను తాను ఎంత మాత్రం సమర్ధించే ప్రయత్నం చేయనని కుండబద్దలు కొట్టేశాడు. ఉదాహరణకు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు నుంచి కీడా కోలా దాకా ఎందరినో పరిచయం చేసినా ఒక్క శాతం కూడా గర్వం ఉండదని, అసలు తనకు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిస్తాడని చెప్పి మూవీ లవర్స్ ఊహాగానాలకు తావు లేకుండా చెక్ పెట్టేశాడు విశ్వక్.

అయితే తాను పని చేసిన వాళ్ళలో ఒకరిలో ఈ లక్షణం చూశానని, ఇప్పుడు అతనూ రియలైజ్ అవుతున్నాడని మరో ట్విస్టు చెప్పాడు విశ్వక్ సేన్. పేరు రివీల్ చేయలేదు.

దీని సంగతలా ఉంచితే ఫిబ్రవరి 13 విడుదలకు ఫంకీ రెడీ అవుతోంది. ఇప్పటిదాకా అంచనాల పరంగా మరీ ఎత్తులో లేదు కానీ హీరోతో పాటు దర్శకుడు అనుదీప్ చేస్తున్న ప్రమోషన్లు సోషల్ మీడియాలో అటెన్షన్ తీసుకొస్తున్నాయి.

గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో లైలా రూపంలో దారుణమైన డిజాస్టర్ చూసిన విశ్వక్ ఆ నిరాశలోనే చాలా కాలం బయట కనిపించలేదు. ఇప్పుడు ఫంకీతో కంబ్యాక్ అవుతానని బలంగా నమ్ముతున్నాడు. రేపు ట్రైలర్ లాంచ్ జరగనుంది. సంక్రాంతి పెద్ద సినిమాల తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ వద్ద సందడి లేదు. దాన్ని ఫంకీ తీరుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ట్రేడ్ వర్గాలు కూడా దాని కోసమే ఎదురు చూస్తున్నాయి.