బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన తొలి సినిమా రామ్ నగర్ బన్నీ రిలీజ్‌కు ముందు ఎంత నెగెటివిటీ ఎదుర్కొన్నాడో తెలిసిందే. తన సినిమా ఈవెంట్లో అతడి హావభావాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి.. దాని మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
ఈ క్రమంలో చంద్రహాస్‌కు యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ కూడా వచ్చింది. ఇక తన తొలి చిత్రం రామ్ నగర్ బన్నీ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపకుండానే వెళ్లిపోయింది. దీంతో కెరీర్ ఆరంభంలోనే చంద్రహాస్‌కు పెద్ద బ్రేక్ పడింది. అయినా అతడిలో ఏమీ కాన్ఫిడెన్స్ తగ్గలేదు.
బరాబర్ ప్రేమిస్తా అంటూ ఇప్పుడు అతను కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇంటర్వ్యూల్లోనే కాదు.. ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ చంద్రహాస్ కాన్ఫిడెన్స్ ఏమీ తగ్గలేదు.
బరాబర్ ప్రేమిస్తా ప్రి రిలీజ్ ఈవెంట్లో అయితే చంద్రహాస్ మరింత కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. దాదాపు పది నిమిషాలు ఎంతో ఆత్మవిశ్వాసంతో స్పీచ్ ఇచ్చాడు. టీంలో అందరి గురించి.. అలాగే అతిథులుగా వచ్చిన ఆది సాయికుమార్, జయంత్ సి.పరాన్జీల గురించి బాగా మాట్లాడాడు. ఆది లాగే తానూ కష్టపడతానని, సక్సెస్ వచ్చే వరకు ఆగనని ధీమా వ్యక్తం చేశాడు.
ఫిబ్రవరి 6న బరాబర్ ప్రేమిస్తా రిలీజవుతుందని.. తాను ప్రేక్షకులను బరాబర్ ప్రేమిస్తానని.. అలాగే వాళ్లు కూడా తనను ప్రేమిస్తారని అతనన్నాడు. బరాబర్ ప్రేమిస్తా సినిమా ఎక్కడా బోర్ కొట్టదని.. ఇందులో సూపర్ ట్విస్టులుంటాయని.. ఎమోషన్ కూడా బాగుంటుందని చెప్పాడు చంద్రహాస్.
మరోవైపు చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. చంద్రహాస్‌ను కొందరు ఇష్టపడవచ్చు, కొందరు ఇష్టపడకపోవచ్చని.. కానీ అతను సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత పడుతున్నాడని చెప్పాడు. మిడ్ సమ్మర్లో ఈ సినిమా కోసం కరీంనగర్లో ఓపెన్ ప్లేస్‌లో షూటింగ్ చేశాడంటూ తన కొడుకు కమిట్మెంట్ గురించి వివరించాడు ప్రభాకర్.
ఫిబ్రవరి 6వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమాకి మంచి టాక్ వస్తె యాటిట్యూడ్ స్టార్ కోసం జనం థియేటర్లకు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పెద్ద రిలీజులు లేని సమయంలో వస్తున్న బరాబర్ ప్రేమిస్తా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates