అన్నగారంటే ఇంత నిర్లక్ష్యమా?

థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు వెర్షన్ ‘అన్నగారు వస్తారు’ పేరుతో గత డిసెంబర్ లో అనౌన్స్ మెంట్ ఇచ్చి, కార్తీతో హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయించడం ఫ్యాన్స్ కి గుర్తుండే ఉంటుంది.

డబ్బింగ్ విషయంలో కార్తీ చాలా శ్రద్ధ తీసుకుంటాడు. స్వంతంగా గొంతు ఇవ్వడంతో పాటు కంటెంట్ కి సంబంధించి తమిళ భాష, బోర్డులు ఏమైనా ఉంటే వాటిని మార్చేలా జాగ్రత్త పడతాడు. కానీ అన్నగారు వస్తారు ఓటిటిలో అవేవీ పాటించకపోవడం సినిమా చూసిన టాలీవుడ్ మూవీ లవర్స్ ని బాధ పెడుతోంది.

అసలు విషయానికి వస్తే అన్నగారు వస్తారు తమిళ వెర్షన్ లో ఎంజిఆర్ రెఫరెన్సులు చాలా ఉన్నాయి. స్టోరీ మెయిన్ పాయింటే ఆయన చుట్టూ తిరుగుతుంది. మనకు ఆ లెజెండరీ నటుడితో కనెక్టివిటీ లేదు కాబట్టి ఆ స్థానంలో స్వర్గీయ ఎన్టీఆర్ ని వాడుకున్నారు. కానీ తెరమీద సన్నివేశాల్లో ఎంజిఆర్ కనిపిస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ డైలాగులు వస్తుంటాయి.

ఏ మాత్రం సింక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అవి సాగుతున్న తీరు చూస్తే చిరాకు కలగక మానదు. అసలే డిజాస్టర్ కంటెంట్, సరే పోన్లే ఇంట్లోనే చూస్తున్నాం కదాని సంతోష పడేందుకు లేకుండా ఇలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్న తీరు షాక్ కలిగిస్తుంది.

సినీ ప్రియులు దీని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నగారు వస్తారు తెలుగు వెర్షన్ విడిగా అప్లోడ్ చేయకుండా కేవలం ఆడియో ఆప్షన్ పెట్టడం పట్ల నిరసన తెలుపుతున్నారు. ఇంత నిర్లక్ష్యం తగదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయినా ఇది అరణ్య వేదనగానే నిలుస్తుంది.

ఎందుకంటే ఈ మధ్య చాలా తమిళ మలయాళ సినిమాలు కనీసం టైటిల్స్ మార్చకుండా అర్థం తెలియకపోయినా వాటినే పెడుతున్నారు. ఇప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్ ని మిక్స్ చేయడంలో ఆశ్చర్యం లేదు. వీటి సంగతి ఎలా ఉన్నా వా వాతియర్ కు డిజిటల్ లోనూ తిరస్కారం ఎదురయ్యింది. నెగటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి.