యాంకర్ స్రవంతి చొక్కారపు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో షోలు, ఇంటర్వ్యూలతో అలరించిన ఆమె ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. సుహాస్, శివాని నగరం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘హే భగవాన్’ సినిమాతో ఆమె నటిగా లాంచ్ అవుతున్నారు. ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో స్రవంతి తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
అనంతపూర్ జిల్లా కదిరి నుండి వచ్చిన స్రవంతి, 2009లోనే మంచి నటి అవ్వాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే వెండితెరపై కనిపించడానికి ఆమెకు దాదాపు 16 సంవత్సరాల సమయం పట్టింది. ఇన్ని ఏళ్ల నిరీక్షణ తర్వాత ‘హే భగవాన్’ సినిమాతో తన కల నెరవేరబోతోందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఇక్కడి వరకు రావడం తన పట్టుదలకు నిదర్శనమని చెప్పారు.
తాను పవన్ కళ్యాణ్ డివోట్ అంటూ గతంలో పవర్ స్టార్ చెప్పిన కొన్ని మాటలను కూడా స్రవంతి గుర్తు చేసుకున్నారు. తాను దారంతా చీకటిగా, గతుకులుగా ఉన్నా గుండెల నిండా ధైర్యంతో ముందుకు సాగాలనే పవన్ కళ్యాణ్ మాటలే తనను ఇన్నేళ్లు నడిపించాయని తెలిపారు. ఆ ధైర్యమే తనను గివ్ అప్ ఇవ్వకుండా ఇండస్ట్రీలో నిలబెట్టిందని పేర్కొన్నారు. తన కెరీర్ ఎదుగుదలకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులకు ఆమె ఈ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గోపి అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది. సుహాస్ సినిమాల్లో నటీనటుల పాత్రలకు మంచి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి, స్రవంతికి కూడా ఒక గుర్తుండిపోయే పాత్ర దొరికిందని తెలుస్తోంది. యాంకర్‌గా మెప్పించిన ఆమె నటిగా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ‘హే భగవాన్’ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates