దర్శకుడి ప్రేమ కథ… త్వరలోనే చెప్పేస్తాడట

ఒక సినిమా కోసం పని చేస్తూ హీరో హీరోయిన్లు ప్రేమలో పడడం.. తర్వాత నిజ జీవితంలో కూడా జంటగా మారడం ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది విషయంలో జరిగింది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కూడా ఈ కోవలోకే చేరబోతున్నట్లుగా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

దర్శకుడిగా పరిచయం అయి, ఆ తర్వాత నటనలోకి అడుగు పెట్టిన తరుణ్ భాస్కర్.. ఈషాతో కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రంలో నటించాడు. ఐతే ఈ సినిమా మొదలవడానికి ముందే తరుణ్, ఈషాల మధ్య రిలేషన్‌షిప్ మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ సినిమా టైంలో బంధం మరింత బలపడినట్లుగా ప్రచారం జరిగింది. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఐతే ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న తరుణ్, ఈషాలకు వారి ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఈషా రెబ్బాను దీని గురించి అడిగితే.. మంచి విషయాలు సరైన సమయంలో జరుగుతాయని.. ఇప్పుడు తాను ఏమీ క్లారిటీ ఇవ్వాలనుకోవడం లేదని.. ఏదైనా ముఖ్యమైన విషయం తన జీవితంలో జరుగుతున్నట్లయితే అందరికీ అధికారికంగా చెబుతానని పేర్కొంది ఈషా.

పెళ్లి ఖాయం అయితే దాని గురించి ప్రకటన చేస్తానన్నది ఈషా మాటల సారాంశంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తరుణ్ భాస్కర్‌ను నేరుగా ఒక ఇంటర్వ్యూలో ఈషాతో ప్రేమ, పెళ్లి గురించి అడిగారు. ఈ దీనికి అతను బదులిస్తూ.. ఈషా తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పాడు. 

కొన్నేళ్లుగా ఆమె తనకు తోడుగా ఉందని, తనకు అన్నీ ఈషానే అని కూడా అతను పేర్కొనడం విశేషం. ఇందులో చెప్పడానికి, దాచడానికి ఏమీ లేదన్న తరుణ్.. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి, సరైన సమయంలో తమ బంధం గురించి ప్రకటన చేస్తానని అతనన్నాడు.

తాను దేన్నయినా ఈజీగా తీసుకుంటానని, పెద్దగా ఫీల్ కానని.. కానీ తాను ఏదైనా చెబితే వేరే వ్యక్తుల మీద ఏమైనా ప్రభావం చూపుతుందేమో అని వెయిట్ చేస్తున్నానని.. అన్నీ కుదిరితే కచ్చితంగా త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని తరుణ్ చెప్పాడు. తరుణ్ మాటల్ని బట్టి చూస్తే అతి త్వరలోనే ఈషాతో పెళ్లి గురించి అతను అధికారికంగా ప్రకటన చేస్తాడనిస్తోంది.