నేను ఇంటర్ లో ఉండగా గుంటూరు లీలా మహల్ లో వారానికి ఒక ఇంగ్లీష్ సినిమా మారుతుండేది.. నేను తరుచు ఇంగ్లీష్ సినిమాలు చూస్తుండేవాడిని.. ఒకసారి మా నాన్నని డబ్బులు అడిగాను సినిమాకెళతానని.. ఆ ఇంగ్లీష్ సినిమా ఆ రోజే లాస్ట్.. ఈ రోజు లేవు రేపు వెలుదువుగానిలే అన్నాడు.. కానీ ఆ సినిమా చూడాలి.. సరే నేను దాచుకున్న ఎమర్జెన్సీ ఫండ్ లో నుంచి డబ్బు తీసి టిక్కెట్ కొని వెళ్లాను.. అప్పుడే సిగరెట్ స్టార్ట్ చేశాను.. ఇంటర్వెల్ లో తర్వాత వచ్చే సినిమాల ఫోటోకార్డ్స్ చూస్తూ సిగిరెట్ వెలిగించి గట్టిగా దమ్ము లాగాను.. స్టైల్ గా పొగ వదులుతూ పక్కకు చుస్తే మా నాన్న.. వెంటనే సిగరెట్ కింద పడేసి కాలితో తొక్కి గబగబా టాయిలెట్స్ వైపు వెళ్లాను..
ఇంటర్వెల్ అయ్యాక లోనికి రమ్మన్నట్టు ఒక బెల్ కొట్టేవారు.. అది కూడా కొట్టాక 5నిమిషాల తర్వాత లోపలి వెళ్లాను.. చీకట్లో మా నాన్న నిలబడి నా చెయ్యి ఓపెన్ చేసి దానిలో 5 రూపాయల నోటు ఉంచి చెయ్యి మూసి తన సీట్ లో కెళ్ళి కూర్చున్నాడు.. నాకు టెన్షన్.. అంటే నేను సిగరెట్ తాగడం చూసాడు.. ఇంకో పావుగంటలో సినిమా ముగుస్తుందనగా లేచి వెళ్ళిపోయాను.. తర్వాత ఒక నెలరోజులు ఆ టాపిక్ మాట్లాడలేదు.. సిగిరెట్ తాగడం చూడకుండా డబ్బు ఎందుకు ఇచ్చాడు.. చుస్తే ఎందుకు అడగలేదు.. ఇదే ఆలోచన.. చివరికి ఒకరోజు.. సిగెరెట్స్ తాగుతున్నావా.. ఇప్పుడే మొదలుపెడితె మానెయ్.. బాగా అలవాటయితే నెమ్మదిగా తగ్గించి తర్వాత మానెయ్ అన్నాడు.. అదీ మా నాన్న..
మనీ సినిమా జరుగుతుండగా ఒక ఫుల్ పేజ్ యాడ్ వేసాము.. అది రెండు కాపీలు కొని ఒకటి మా అమ్మ పట్టుచీరల కింద దాచి.. ఒక దానిని వూరందరికీ చూపించాడు.. మనీ ఒక దశలో రకరకాల కారణాలతో ఆగిపోయింది.. వూరు నుండి ఫోన్. నాన్నకు బాగాలేదని.. నేను వెళ్లేసరికి హాస్పటల్ లో వున్నారు.. బాగా శుష్కించిపోయారు..క్యాన్సర్ అని డాక్టర్లు చేప్పారు ఇంకా వారం రెండు వారాల కంటే వుండరు అని.. ఆదశ లో కూడా ఫుల్ పేజ్ యాడ్ వేసిన పేపర్ ని దిండు కింద పెట్టుకుని అప్పుడప్పుడు చూస్తూ ఉండేవారు..
నేను హైద్రాబాద్ లోనె ముందు మీతోపాటు సినిమా చూస్తా అనేవారు.. నాన్నా ఆ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదు అప్పటివరకు నువ్వు వుండవు అని చెప్పలేను. దుఃఖాన్ని లోపలే దిగమింగుకునేవాడిని.. తర్వాత మూడు రోజులకు ఆయన పోయారు.. బాడీ ని టాక్సీ లో వూరు తీసుకెల్తున్నాను.. నాకు ఏడుపు రావడం లేదు.. కనిపించిన ప్రతివాడిని విష్ చేస్తున్నా కార్ లోనుంచే..
ఇంటికి వెళ్లి సాయంత్రం వరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్లు పరామర్శించేవాళ్ళు.. కానీ ఏడుపు లేదు.. మెదడు ఘనీభవించింది.. సరే 5గంటలకు పాడె కట్టి తీసుకెళుతూ దింపుడు కల్లం అని ఆపి మూడు సార్లు పిలవాలి నాన్నా.. నాన్నా.. నాన్నా అని పిలుస్తున్నా… అప్పుడు గుర్తొచ్చింది మనీ సినిమాలో చక్రవర్తికీ వీధిబిచ్చగత్తె కీ అనే పాటలో నేను తీసిన షాట్.. ఊరేగింపుగా వెళుతున్న డెడ్ బాడీ ని కిందికి దింపి నాన్నా అని ఒకడు పీలుస్తుంటే jd.. చిన్నా జేబులోనుంచి వందనోటు ముక్కుగగ్గర పెడితే లేచి కూర్చుంటాడు.. నోటు తియ్యగానే మళ్ళీ పడిపోతాడు… ఇది గుర్తొచ్చింది.. అంతే.. మానాన్న పాడె పక్కనే నెల మీదపడి పొర్లిపొర్లి ఏడ్చాను.. తర్వాత అంత్యక్రియలు జరిపించాము..
అప్పటి వరకు నాకు పిచ్చెక్కింది అనుకున్నారు అందరూ.. కొన్ని సంఘటనలను సినిమాలో కామెడీ కోసం వాడతాం కానీ అదే అనుభవంలోకి వస్తే కానీ తెలియదు దాని వెనుక వున్న పెయిన్…… అంతే..
— శివ నాగేశ్వర రావు