తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప గేయ రచయితల్లో ఒకరు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆ మాటకొస్తే దేశంలోనే అత్యుత్తమ లిరిసిస్టుల్లోనూ ఆయన పేరుంటుంది. తెలుగు పాటకు ఆయన చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. పండితుల నుంచి పామురుల వరకు అందరినీ కదిలించేలా అద్భుతమైన భావంతో పాటలు రాసిన ఘనత ఆయన సొంతం.
ఐతే తక్కువ వయసులోనే, ఇంకా తన పాటతో ప్రేక్షకులను అలరిస్తుండగానే ఐదేళ్ల కిందట ఆయన కన్ను మూశారు. ఆ దిగ్గజ గేయ రచయితకు ఇప్పుడు అనకాపల్లి వాసులు గొప్ప గౌరవం అందించారు. తాను పుట్టి పెరిగిన ఊరిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు.
సిరివెన్నెలకు వీరాభిమాని.. ఆయన బంధువు కూడా అయిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ విగ్రహ ఏర్పాటులో జనసేన ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు కొణతాల రామకృష్ణ కీలక పాత్ర పోషించారు.
విగ్రహం నిర్మించాలన్న ఆలోచన దగ్గర్నుంచి.. ఏర్పాటు వరకు అన్నింట్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. సిరివెన్నెల విగ్రహ ఏర్పాటు విషయంలో అన్నీ తానై వ్యవహరించిన కొణతాలకు క్రెడిట్ ఇస్తూ పోస్టు పెట్టారు.
దీంతో కొణతాలపై సిరివెన్నెల అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సిరివెన్నెల విగ్రహావిష్కరణలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సహా పలువురు రాజకీయ నాయకులు, సాహితీ వేత్తలు, అధికారులు కూడా పాల్గొన్నారు. సిరివెన్నెల 66 ఏళ్ల వయసులో 2021లో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates