సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ప్రొఫెషనల్ యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసే పనిలో ఉన్న గౌతమ్, త్వరలోనే వెండితెరకు పరిచయం కావచ్చు. అయితే, ఈ ప్రాజెక్టును నిర్మించడానికి అశ్వినీ దత్, అనిల్ సుంకర వంటి బడా నిర్మాతలు రేసులో ఉన్నట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వైరల్ అవుతోంది. నిర్మాతలు సిద్ధమే కానీ అసలు కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో రగులుతున్న సందేహం.
గౌతమ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం ఒక ఎత్తయితే, ఆ బాధ్యతను విజయవంతంగా మోయడం మరో ఎత్తు. ఘట్టమనేని లెగసీని ముందుకు తీసుకెళ్లే మూడో తరం వారసుడిగా గౌతమ్ ఎంట్రీపై అంచనాలు హై రేంజ్ లో ఉంటాయి. కృష్ణ గారి మాస్ ఇమేజ్, మహేష్ బాబు స్టార్‌డమ్ తర్వాత వస్తున్న గౌతమ్‌ను ప్రెజెంట్ చేయడం ఏ దర్శకుడికైనా కత్తి మీద సామే. అందుకే ఈ విషయంలో మహేష్ బాబు అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోకపోవచ్చు.
కేవలం నిర్మాతల ఇష్టానికో లేదా సెంటిమెంట్లకో ఈ అవకాశాన్ని వదిలేయకుండా, గౌతమ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథను సిద్ధం చేయగల దర్శకుడి కోసం ఆ అన్వేషణ ఉండబోతోంది.
గౌతమ్‌ను లాంచ్ చేసే దర్శకుడికి అది ఒక గొప్ప అదృష్టం కావొచ్చు కానీ, దాని వెనుక ఉండే ఒత్తిడి మాత్రం ఊహాతీతం. ఘట్టమనేని ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంతో పాటు, నేటితరం ఆడియన్స్‌కు నచ్చేలా గౌతమ్‌ను ఆవిష్కరించడం చాలా కీలకం. కేవలం స్టార్ కిడ్ అనే ముద్ర వేయకుండా, ఒక పరిపూర్ణమైన నటుడిగా గౌతమ్‌ను నిలబెట్టగల విజన్ ఉన్న దర్శకుడికే ఇక్కడ ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నా, డైరెక్టర్ ఇచ్చే కంటెంటే ఈ సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
గతంలో ‘1 నేనొక్కడినే’లో బాలనటుడిగా కనిపించినప్పుడు గౌతమ్ తనలోని నటుడిని క్లియర్ గా చూపించారు. ఇప్పుడు హీరోగా అరంగేట్రం అంటే ఆ ఇంపాక్ట్ రెట్టింపు ఉండాలి. అందుకే మహేష్ బాబు మరీ కమర్షియల్ మాస్ సినిమాలు కాకుండా, ఒక ఫ్రెష్ సబ్జెక్టుతో గౌతమ్‌ను పరిచయం చేసే ఆలోచనలో ఉండవచ్చు.
ఈ విషయంలో ఏ దర్శకుడిని ఫైనల్ చేస్తారనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక బిగ్ సస్పెన్స్. లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో కానీ, ఆ దర్శకుడు మాత్రం ఒక పెద్ద బాధ్యతను భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. ఇక గౌతమ్ ఎంట్రీ ప్రాజెక్టుపై అధికారిక క్లారిటీ రావడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. నిర్మాతల మధ్య పోటీ ఒకవైపు ఉన్నా, క్రియేటివ్ పరంగా మహేష్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
