మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ లేదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చాక పలు సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా మగాళ్లను కుక్కలతో పోలుస్తూ ఆమె పెట్టిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. దేశంలో వీధి కుక్కల సమస్య అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. వాటిని షెల్టర్లకు తరలించాలంటూ గత ఏడాది జులైలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

దీని మీద డాగ్ లవర్స్ నిరసనలకు దిగారు. న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల ప్రవర్తన ఆధారంగా వాటిని వర్గీకరించడం సాధ్యం కాదన్నట్లు మాట్లాడింది. ఈ కుక్క కాటేస్తుంది, ఆ కుక్క కాటేయదు అని అని ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదని.. వీధి కుక్కల మూడ్‌ను ఎవరూ అర్థం చేసుకోలేరని కోర్టు పేర్కొంది.

దీనిపై రమ్య స్పందించింది. మగాళ్ల మనసులను అర్థం చేసుకోవడం కూడా కష్టమని.. వాళ్లు ఎప్పుడు ఎవరిని రేప్ చేస్తారో, ఎవరిని చంపుతారో కనిపెట్టలేమని.. కాబట్టి వాళ్లందరినీ జైల్లో పెట్టాలా అని ఆమె ప్రశ్నించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపుతోంది. మనుషులకు, జంతువులకు పోలికా.. పైగా మగాళ్లను కుక్కలతో పోల్చడమా అంటూ ఆమె మీద పురుష నెటిజన్లు మండిపడుతున్నారు. 

కొందరు చేసే తప్పులకు మొత్తం మగజాతినే ఇలా నిందించడం.. దారుణమైన పోలిక పెట్టడం ఎంత వరకు న్యాయం అంటున్నారు. ఆమె కౌంటర్ ఇచ్చింది సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు అని.. రమ్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని.. ఆమె మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో రమ్య సారీ చెప్పాల్సి వస్తుందేమో అని భావిస్తున్నారు. మరి ఆమె ఏం చేస్తుందో చూడాలి.