తెలుగు స్టార్ హీరో కన్నడిగ రోల్ చేస్తే?

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ నాలుగు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ కలిసి సినిమా చేసింది లేదు. కానీ అనిల్ రావిపూడి ఈ అరుదైన కాంబినేషన్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో వెంకీతో ప్రత్యేక పాత్ర చేయించారు. ఈ చిత్రంలో వెంకీ నటిస్తున్నాడనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి అందరూ ఎగ్జైట్ అయ్యారు.

వెంకీ టాలీవుడ్లో అందరివాడు. అందరు హీరోలూ తనను ఇష్టపడతారు. ఆ హీరోల ఫ్యాన్స్ సైతం అంతే అభిమానిస్తారు. అలాంటి హీరో చిరు సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడంతో ప్రేక్షకుల్లో అమితాసక్తి ఏర్పడింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ చూస్తే.. సినిమాలో వెంకీ పాత్ర హైలైట్‌గా ఉండబోతోందని.. చిరుతో ఆయన కాంబినేషన్లో సీన్లు బాగా పేలుతాయని అర్థమైంది.

నిన్న జరిగిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెంకీ పాత్ర గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు. వెంకీ ఇందులో కన్నడిగుడి పాత్ర చేస్తున్నాడట. తన పాత్ర పేరు వెంకీ గౌడ అని.. అతను కర్ణాటక నుంచి వస్తాడని వెల్లడించాడు. ఒక తెలుగు హీరో ఇలా కన్నడిగుడి పాత్ర చేయడం క్రేజీగా అనిపించే విషయం. మరి వెంకీతో సినిమాలో కన్నడ డైలాగులు చెప్పించాడేమో చూడాలి.

సినిమాలో సెకండాఫ్‌లో వెంకీ పాత్ర వస్తుందని.. దాదాపు అరగంట పాటు ఆ పాత్ర ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ సైతం ఈ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల గురించి బాగానే హైప్ ఇస్తున్నాడు. వెంకీ ఉన్నంతసేపు ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో ఉంటుందని.. చిరు, వెంకీ అభిమానులే కాక.. అన్ని రకాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేసేలా ఆ సీన్లు ఉంటాయని అంటున్నాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ ఆదివారం రాత్రి పెయిడ్ ప్రిమియర్స్‌తో రిలీజవుతోంది. అఫీషియల్ రిలీజ్ సోమవారం.