ఈ నిర్మాత‌కు టాలీవుడ్ రుణ‌ప‌డి ఉండాలి


ఎన్నో నెల‌ల కింద‌టే ఫ‌స్ట్ కాపీతో రెడీ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి తెలుగులో. క‌రోనా కార‌ణంగా వాటిని అలా ప‌క్కన పెట్టేశారు. ఓటీటీల నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా వ‌ద్ద‌న్నారు. వ‌డ్డీల భారం మీద ప‌డ్డా కూడా త‌ట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు థియేట‌ర్లు తెరుచుకున్నాయి. కొత్త సినిమాల కోసం అవి ఎదురు చూస్తున్నాయి. కానీ త‌మ సినిమాల‌ను రిలీజ్ చేసే ధైర్యం నిర్మాత‌ల‌కు రావ‌ట్లేదు. ఎందుకంటే 50 శాతం ఆక్యుపెన్సీ స‌హా అనేక ష‌ర‌తుల మ‌ధ్య సినిమాను రిలీజ్ చేసి రెవెన్యూ త‌గ్గించుకోవ‌డానికి వాళ్లు సిద్ధంగా లేరు. ప్ర‌స్తుతానికైతే థియేట‌ర్ల‌కు వెళ్లి చూసే ఉత్సాహం ప్రేక్ష‌కుల్లో ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు.

ఈ మ‌ధ్యే తెరుచుకున్న థియేట‌ర్లు చాలా వ‌ర‌కు ఖాళీగానే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాస్త పేరున్న కొత్త సినిమాలు రిలీజైతే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పుడుతుందేమో. ఐతే ధైర్యం చేసి సినిమాల‌ను రిలీజ్ చేసేదెవ‌ర‌న్న‌ది ప్ర‌శ్న‌. ఈ వ్య‌వ‌హారం పిల్లి మెడ‌లో గంట క‌ట్టేదెవ‌ర‌న్న‌ట్లుగా త‌యారైంది.

ఐతే మిగ‌తా నిర్మాత‌లు చేయ‌ని ధైర్యం సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ చేస్తున్నారు. త‌న ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కిన సోలో బ్రతుకే సో బెట‌ర్‌ను ఈ నెల 25న క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ఆయ‌న ఫిక్స‌య్యారు. ముందు దీని గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చినా జ‌నాలు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ ప్ర‌క‌ట‌న‌కు క‌ట్టుబ‌డి ఉంటార‌నుకోలేదు. కానీ చిత్ర బృందం 25న థియేట్రిక‌ల్ రిలీజ్ దిశ‌గానే అడుగులేస్తోంది. ఆ దిశ‌గా ప్ర‌మోష‌న్లు కూడా చేస్తోంది.

ప్రేక్ష‌కులు వ‌స్తారా రారా.. ఆదాయం మ‌రీ త‌గ్గిపోతుందేమో అని చూడ‌కుండా ధైర్యంగా సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు ప్ర‌సాద్. ఇందుకు జీ వాళ్లు ఇచ్చిన భ‌రోసా కూడా కార‌ణం కావ‌చ్చు. కానీ ఈ సాహ‌సం మ‌రే నిర్మాతా చేయ‌లేక‌పోయాడు. ఇలాంటి పేరున్న సినిమా రిలీజైతే, దానికి మంచి స్పంద‌న వ‌స్తే త‌ర్వాత మిగ‌తా నిర్మాత‌లు క‌దులుతారేమో. ఇలాంటి త‌రుణంలో త‌న సాహ‌సంతో ఇండ‌స్ట్రీకి ప్ర‌సాద్ ఎంతో మేలు చేస్తున్నార‌నే చెప్పాలి. అందుకు ప‌రిశ్ర‌మ ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉండాల్సిందే.