ప్రభాస్ గురించి జక్కన్న చెప్పింది నిజమే

హీరోల్లో కొందరు బహుముఖ ప్రజ్ఞాశాలులు ఉంటారు. వాళ్లను అందరూ నటులుగానే చూస్తారు కానీ.. బయటికి కనిపించని వేరే టాలెంట్స్ చాలానే ఉంటాయి. అది వాళ్లతో కలిసి పని చేసిన, సన్నిహితులకు మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్‌ గురించి కూడా జనాలకు తెలియని టాలెంట్స్ చాలానే ఉన్నాయని తన దర్శకులే చెబుతుంటారు.

ప్రభాస్‌కు ఎడిటింగ్ మీద ఉన్న పట్టు గురించి గతంలో దర్శక ధీరుడు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను నటన బాగా నేర్చుకో అని అంటే, ఎడిటింగ్ నేర్చుకుంటా డార్లింగ్ అని ప్రభాస్ అన్నట్లు జక్కన్న తెలిపాడు. అప్పుడే రాజమౌళితో ప్రభాస్ సరదాగా ఏమీ ఆ మాట అనలేదని ఇప్పుడు దర్శకుడు మారుతి చెప్పిన మాటల్ని అర్థమవుతోంది.

ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ లాంటి భారీ చిత్రాన్ని రూపొందించిన మారుతి.. ప్రభాస్‌లోని హిడెన్ టాలెంట్స్ గురించి మా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ప్రభాస్‌కు టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉందని.. ఈ సినిమాలో సాంకేతిక అంశాల గురించి అందరి కంటే ప్రభాస్‌తోనే ఎక్కువ డిస్కస్ చేశానని మారుతి వెల్లడించాడు.

‘రాజాసాబ్’లో చాలా జంతువులు ఉంటాయని.. సీజీ ద్వారా వాటిని తెరపైకి తెచ్చేందుకు తెర వెనుక చాలా కష్ట పడ్డామని మారుతి వెల్లడించాడు. స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్షన్ టీం, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలతో కలిసి సమన్వయం చేసుకుని వేరేగా ఒక సినిమా తీసినంత కష్ట పడ్డామని మారుతి వెల్లడించాడు.

ఇక ఈ క్రియేచర్స్ ఎలా ఉండాలి.. అవి ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు ప్రభాస్‌తోనే ఎక్కువ చర్చించేవాడినని.. ఆయన విలువైన సలహాలు ఇచ్చేవారని మారుతి తెలిపాడు. దీంతో పాటు ప్రభాస్‌కు ఎడిటింగ్ మీద కూడా బాగా గ్రిప్ ఉందని ఆయన వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళితో అన్నట్లే ప్రభాస్ ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాడని అర్థమవుతోంది.