ప్రమోషన్లు చేయకపోవడంపై యువ హీరో రెస్సాన్స్

నూతన సంవత్సర కానుకగా రాబోయే గురువారం ‘వనవీర’ అనే సినిమా రిలీజ్ కాబోతోంది. ముందు ‘వానర’ అనే పేరుతో ఉన్న ఈ సినిమాకు ఇటీవల ఏవో ఇబ్బందులు తలెత్తి ‘వనవీర’ అని టైటిల్ మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరో కమ్ డైరెక్టర్ అవినాష్ తిరువీధుల.. రిలీజ్ ముంగిట టైటిల్ మార్చాల్సి రావడంపై చాలా ఎమోషనల్ అయ్యాడు.

అలాగే ఈ సినిమాలో భాగమైన ఒక నటుడు.. ప్రమోషన్లకు దూరంగా ఉండడం మీదా స్పందించాడు. ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ అని ఆ నటుడిని సినిమాలో పెట్టుకున్నామని.. కానీ తమ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టలేదని వాపోయాడు అవినాష్. ఆ నటుడెవరో పేరు చెప్పకపోయినా అది నందు అని అందరికీ అర్థమైపోయింది.

నందు లీడ్ రోల్ చేసిన ‘సైక్ సిద్దార్థ’ కూడా జనవరి 1నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ‘వనవీర’ హీరో, దర్శకుడు అవినాష్ తన మీద పరోక్షంగా చేసిన విమర్శలపై నందు స్పందించాడు. ‘వనవీర’ సినిమా మేకర్స్ తన పేరు ఎత్తకుండా తనను విమర్శించినప్పటికీ.. తనకేమీ బాధ లేదని, ఆ సినిమా మీద తనకు ప్రేమే ఉందని నందు చెప్పాడు.

ఎప్పుడో 36 ఏళ్ల కిందట మోహన్ బాబు హీరోగా నటించిన, విలన్‌గా చేసిన సినిమాలు ఒకే రోజు రిలీజయ్యాయని.. తర్వాత అలాంటి ఘనత సాధించిన నటుడు తానే అని ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పాడని.. ఇలా జరుగుతున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందని నందు చెప్పాడు.

ఐతే ‘వానర’ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ గురించి ముందు రోజు సాయంత్రం నిర్మాత కాల్ చేసి చెప్పాడని.. అప్పుడు తాను గుంటూరులో ఉన్నానని.. మరుసటి రోజు 10 గంటలకు తాను ప్రెస్ మీట్‌కు రాలేనని చెబితే, నిర్మాత సరే అన్నాడు తప్ప.. తన కోసం సాయంత్రం వరకు వెయిట్ చేస్తానని కూడా అనలేదని.. తనకు ముెందే సమాచారం ఇచ్చి ఉంటే ఈ ఈవెంట్ కోసం ప్లాన్ చేసుకుని ఉండేవాడనని నందు చెప్పాడు. తన మీద విమర్శలు చేసినప్పటికీ ఆ సినిమా మేకర్స్ మీద తనకేమీ కోపం లేదని.. ఆ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నందు చెప్పాడు.