హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వేడుక జరిగిన మైదానం కొంచెం చిన్నదే అయినప్పటికీ వేలాదిగా వచ్చిన డార్లింగ్ అభిమానులతో ప్రాంగణం కోలాహలంగా మారింది. నటించిన, పని చేసిన ప్రతి ఒక్కరు హాజరు కావడంతో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలగలేదు.
ముఖ్యంగా ప్రభాస్ గుబురు గెడ్డంతో స్పిరిట్ లుక్ లో దర్శనమిచ్చేసరికి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో తక్కువ టైంలో ఇంత మాసివ్ సెలెబ్రేషన్స్ జరగడం అరుదు. జనవరి 9 రాబోయే రాజా సాబ్ ప్రమోషన్లకు మంచి ఫౌండేషన్ పడింది. ఇక మారుతీ భావోద్వేగం అక్కడ ఉన్నవారందరినీ కదిలించేసింది.
రాజా సాబ్ కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో, తాను ఎంత మధన పడ్డానో వివరించే క్రమంలో మారుతీ కన్నీళ్లు ఆపుకోలేక అవతలి వైపు తిరిగాడు. తమన్ వచ్చి ఓదార్చినా లాభం లేకపోయింది. ఎస్కెఎన్ వల్ల కొంత తేరుకున్నట్టు అనిపించినా మరోసారి మళ్ళీ ఎమోషన్ కు గురి కావడంతో ఈసారి ఏకంగా ప్రభాస్ స్టేజి పైకి వచ్చి హత్తుకుని ఓదార్చాడు.
మారుతీ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే డార్లింగ్ ని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా సరే రాజా సాబ్ ఒక్క శాతం నచ్చకపోయినా తనను నిలదీయమంటూ విల్లా అడ్రెస్ డోర్ నెంబర్ తో ఇవ్వడం ఊహించని ట్విస్టు. ఇది చూసి యూనిట్ సభ్యులు సైతం ఆశ్చర్యపోయారు.
మారుతీ ఇంత రియాక్ట్ అవ్వడానికి కారణం ఉంది. రాజా సాబ్ మూడేళ్ళ కష్టం. ప్రభాస్ కటవుట్ ని నమ్మి నాలుగు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు. మీడియం బడ్జెట్ సినిమాలకు పరిమితమైన మారుతీని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లేలా ప్రభాస్ దీన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం.
అందులోనూ స్టార్ హీరోలు రిస్క్ అని భావించే హారర్ కామెడీకి ఎస్ చెప్పడం ఇంకో మలుపు. బయట ఎన్ని కామెంట్లు వచ్చినా ఈ ప్రాజెక్టు వద్దని వారించినా ప్రభాస్ పూర్తిగా మారుతీని నమ్మాడు. అదే ఇప్పుడు ఈ స్థాయికి సినిమాని తెచ్చింది. ఇంకో పన్నెండు రోజుల్లో జరగబోయే డార్లింగ్ సంభవానికి ఏమేం రికార్డులు బద్దలవుతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates