హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రంగా ఖండించారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేసిన ఆయన, ఆ విషయంలో ఎవరికీ సూచనలు చేసే హక్కు లేదన్నారు. మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధమని, మగ అహంకారంతో మహిళల వస్త్రధారణపై మాట్లాడడం తగదని వ్యాఖ్యానించారు.
మగవారు ఎలా పడితే అలా మాట్లాడుతారా? మహిళలను తిట్టే దుర్మార్గులను సమాజం సపోర్ట్ చేస్తుందా? అంటూ నాగబాబు ప్రశ్నించారు.
మన సమాజం ఇంకా పురుషాధిక్య ఆలోచనలతోనే నడుస్తోందని, మహిళలు మోడ్రన్ డ్రెస్ ధరించడం తప్పుకాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ అనేక రూపాల్లో ఉంటుందని గుర్తు చేశారు. మహిళలను కట్టడి చేయడం కంటే వారి భద్రతకు సంబంధించిన వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు వారి వస్త్రధారణ కారణంగా కాదని, మగాళ్ల క్రూరత్వమే కారణమని తేల్చిచెప్పారు.
ఒకప్పుడు నేను కూడా అలాగే ఆలోచించేవాడిని. కానీ నా ఆలోచన మార్చుకున్నాను. ఆడపిల్లలను బతకనీయండి. మగవారితో సమానంగా బతికే హక్కు వారికి లేదా అని నాగబాబు వ్యాఖ్యానించారు. మహిళలు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నటుడు శివాజీ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates