సోషల్ మీడియాలో ఫలానా ఆపద వచ్చిందని సెలబ్రిటీల సహాయం కోరేవాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళు చెప్పుకున్న బాధ నిజమో కాదో కనుక్కుని తెలుసుకునేంత తీరిక అన్నిసార్లు ఉండదు. అందుకే సహాయం అందించడంలో తొందరపడితే అన్యాయంగా డబ్బు వృధా కావడం జరుగుతుంది.
సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ కు ఇది అనుభవమయ్యింది. ప్రసన్న సందేశ్ అనే వ్యక్తి తన తల్లి చనిపోతే అంత్యక్రియలకు డబ్బులు లేవని ఆర్థిక సాయం కోరుతూ ట్వీట్ పెట్టాడు. ఆవిడ మృతదేహం ఫోటో కూడా ఉండటంతో జివి ప్రకాష్ గుడ్డిగా నమ్మేసి 20 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అసలు ట్విస్ట్ వేరే ఉంది.
సదరు ఫోటో ఎక్కడిదా అంటూ అభిమానులు ఆరా తీస్తే అది రెండేళ్ల క్రితం చనిపోయిన ఒక పెద్దావిడదని ఏఆర్ సెర్చ్ లో దొరికేసింది. దీంతో అకారణంగా జివి ప్రకాష్ సొమ్ము దుర్మార్గుడి చేతికి చేరిందని ఫ్యాన్స్ కలత చెందుతున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో నిజమైన బాధితులకు సాయం అందకుండా పోతుంది.
కరోనా సమయంలో సోనూ సూద్ ఇలాగే వేలాది మందికి సహాయం చేశారు. వాళ్ళలో ఒరిజినల్ డూప్లికేట్ రెండు రకాలూ ఉన్నారు. ఇప్పుడిది క్రమంగా ఒక వైరస్ లా మారిపోవడంతో ఎవరు పడితే వాళ్ళు స్టార్లను దర్శకులను జాలి కథలు చెప్పి మోసం చేయడం పరిపాటి అయ్యింది.
ఇకపై ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరవై వేలు జివి ప్రకాష్ కుమార్ కు పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ అదే సొమ్ము కొందరి జీవితాలను నిలబెట్టొచ్చు. ఒకరి చదువుకు సాయపడవచ్చు. కానీ మోసగాడి అకౌంట్ లో పడ్డం వల్ల ఎంత దుర్వినియోగం అవుతోందో చెప్పనక్కర్లేదు.
ఇదంతా చూసి రేపు ఎవరైనా సెలబ్రిటీ నిజంగా హెల్ప్ చేయాలనుకున్నా ముందుకు రాకపోవచ్చు. దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చట్టాలు, చర్యలు లేవు. స్టార్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉంటూ చెక్ చేసుకుని మరీ సహాయం చేయడం అవసరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates