అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘శివ’.. తెలుగు సినిమా అనే కాదు, ఇండియన్ సినిమా గతినే మార్చింది అంటే అతిశయోక్తేమీ లేదు. ఆ తర్వాత సినిమాలు తీసే విధానమే మారిపోయింది. ‘శివ’ నుంచి స్ఫూర్తి పొంది సినిమాల్లోకి వచ్చి గొప్ప స్థాయికి ఎదిగిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు లెక్కే లేదు. ఆ సినిమా వల్ల అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు కూడా ఎంతో ప్రభావితం అయ్యారు.
ఇప్పటికీ ఆ ప్రభావం కొనసాగుతోందంటే ఆశ్చర్యమే. ‘దురంధర్’తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఆదిత్య ధర్ సైతం తన మీద ‘శివ’ ప్రభావం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడిగా ‘ఓం’ సినిమాతో ప్రకంపనలు రేపిన ఉపేంద్ర సైతం తన మీద ‘శివ’ చూపించిన ప్రభావం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడు. ‘శివ’ వల్ల తాను ఇబ్బంది పడి, తర్వాత ఎలా ‘ఓం’ను కల్ట్ మూవీగా మలచగలిగానో ఉపేంద్ర వివరించాడు.
‘‘నేను కాలేజీ రోజుల్లో చదువుకునేటపుడు కర్ణాటకలో అండర్ వరల్డ్ మాఫియా పెద్ద స్థాయిలో ఉండేది. పెద్ద పెద్ద గూండాలు ఉండేవాళ్ళు. నేను చదువుకున్న కాలేజీ కూడా మాఫియా ఏరియాల మధ్యే ఉండేది. నేను దర్శకుడిగా సినిమా తీయాలి అనుకున్నపుడు అండర్ వరల్డ్ మీద నాకున్న అవగాహనతో కథ రాశాను. అందులో కాలేజీ అంశాలను కూడా జోడించాను. తీరా సినిమా తీద్దాం అనుకునే సమయానికి ‘శివ’ రిలీజైంది.
ఆ సినిమా చూసి నేను షాకైపోయాను. నేను తీయాలనుకున్నదంతా ఆ సినిమాలో చూపించేశాడు వర్మ. ఆ సినిమాను ఆయన అద్భుతంగా తీశాడు. ఇక నేనేం చేయాలో అర్థం కాక ‘ఓం’ సినిమా స్క్రిప్టును రెండేళ్లు పక్కన పెట్టేశాను. తర్వాత దానికంటే భిన్నంగా మనం ఎలా సినిమా తీయగలం అని ఆలోచించి.. ఒక రౌడీకి లవ్ స్టోరీ పెట్టి ఆ కథను మార్చాను. స్క్రీన్ ప్లే కూడా భిన్నంగా ప్రయత్నించాను. అలా ‘ఓం’ ఒక విభిన్నమైన సినిమాగా తయారైంది. ఆ సినిమా అంత బాగా రావడానికి శివ కూడా ఒక కారణమైంది’’ అని ఉపేంద్ర వివరించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates