బాలీవుడ్ నటి నోరా ఫతేహికి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలు అయ్యాయి. ముంబై పశ్చిమ అంబోలీ లింక్ రోడ్డుపై నిన్న సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ప్రదర్శన కోసం వెళ్తున్న సమయంలో, మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన వ్యక్తిని 27 ఏళ్ల వినయ్ సక్పాల్‌గా గుర్తించారు. మద్యం సేవించి వాహనం నడిపినట్టు పోలీసులు నిర్ధారించారు. అతడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని, రాష్ డ్రైవింగ్, డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. ప్రమాదం అనంతరం నోరా ఫతేహిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై నోరా ఫతేహి సోషల్ మీడియాలో స్పందించారు. ప్రమాద సమయంలో తాను సీటు నుంచి పక్కన పడి కిటికీకి తల తగిలినట్లు తెలిపారు. ఈ ప్రమాదం చాలా భయానక అనుభవమని పేర్కొన్నారు. స్వల్ప గాయాలు, వాపు, తేలికపాటి కన్‌కషన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates