ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్, జన నాయకుడు పరస్పరం తలపడేందుకు సిద్ధపడటంతో బాక్సాఫీస్ క్లాష్ లో ఎవరు విజేత అవుతారనే దాని మీద రకరకాల అంచనాల్లో ఉన్నారు. ఇప్పుడేం కనిపించడం లేదు కానీ తేదీ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్ల పేరుతో ఆన్ లైన్ యుద్దాలు చేసుకోవడం ఖాయమనిపిస్తోంది. విజయ్ వల్ల రాజా సాబ్ కు తమిళనాడు, కేరళలో థియేటర్ల పరంగా దెబ్బ పడనుండగా ప్రభాస్ వల్ల జన నాయకుడుకి ఏపీ, తెలంగాణలో ఎదురీత ఉంటుంది. ఈ మెగా క్లాష్ వల్ల ఓపెనింగ్స్ పంచుకోవాల్సి ఉంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే నిడివి విషయంలోనూ ఈ రెండు సినిమాలు ఒకే దారిలో ఉన్నట్టు సమాచారం. రాజా సాబ్ ఫైనల్ కట్ 3 గంటల 20 నిముషాలు వచ్చిందని, ఒక పావు గంట ట్రిమ్ చేసే ఆలోచన జరుగుతోందని వినికిడి. అయితే దురంధర్, యానిమల్, పుష్ప 2 ఇంతకన్నా ఎక్కువ లెన్త్ తో ప్రేక్షకులను మెప్పించినప్పుడు రాజా సాబ్ కి ఎందుకు కోతనే కోణంలో దర్శకుడు మారుతీ ఆలోచిస్తున్నారట. ఇక జన నాయకుడు కూడా ఇంచు మించు ఇదే నిడివితో 3 గంటల 15 నిమిషాల దాకా ఉండొచ్చని అంటున్నారు. విజయ్ చివరి సినిమా కాబట్టి పదిహేను నిమిషాల స్పెషల్ వీడియోని ప్లాన్ చేస్తున్నారట.

బహుశా ఫ్యాన్స్ ఎమోషన్స్ ని టార్గెట్ చేయడం కోసం కావొచ్చు. ఏమైనా ఫైనల్ సెన్సార్ లెన్త్ ఎంత ఉంటుందనేది ఆ కార్యక్రమం పూర్తయ్యాకే బయటికి వస్తుంది. అసలే సంక్రాంతి పోటీ. బరిలో మొత్తం ఏడు సినిమాలున్నాయి. వాటితో తలపడాలంటే రాజా సాబ్, జన నాయకుడు యునానిమస్ అనిపించుకోవాలి. కాకపోతే అందరి కంటే ముందు వస్తున్న అడ్వాంటేజ్ ప్రభాస్, విజయ్ లకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎలాగూ టికెట్ హైక్స్ ఇస్తారు కాబట్టి వీలైనంత మొదటి మూడు నాలుగు రోజుల్లోనే రాబట్టేయాలి. చాలా సినిమాలు ఇలా నిడివిని పెంచుకోవడం వల్ల ఖర్చు పెరుగుతుందని ఎగ్జిజిబిటర్లు వాపోతున్నారు.